కన్నప్ప : ప్రభాస్ ప్రేమ ‘పారితోషికం’ వద్దంది..!

మంచు విష్ణు కన్నప్ప ఏప్రిల్ 25 విడుదలకు సిద్ధమవుతోంది. ఇంకో డెబ్భై రోజులు మాత్రమే ఉండటంతో టీమ్ ప్రమోషన్ల వేగం పెంచింది. చాలా పెద్ద క్యాస్టింగ్ తో రూపొందుతున్న ఈ డివోషనల్ మల్టీస్టారర్ మీద వంద కోట్లకు పైగానే బడ్జెట్ అయ్యింది. స్టార్ హీరోలు ఇందులో భాగమయ్యింది క్యామియోల పరంగానే అయినా ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుందట.

అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, దేవరాజ్, మధుబాల, శరత్ కుమార్, ముఖేష్ ఋషి తదితర తారాగణం ఇందులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువగా దృష్టిని ఆకర్షిస్తున్నది మాత్రం ప్రభాసే.

ఆశ్చర్యం ఏంటంటే కన్నప్ప కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ గా తీసుకోలేదు. కేవలం మంచు కుటుంబం అందులోనూ మోహన్ బాబు మీద అభిమానంతో ఉచితంగా నటించేశాడు. అడిగితే నిర్మాతగా ఎంత అడిగినా ఇవ్వడానికి విష్ణు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభాస్ నయా పైసా తీసుకోకపోవడం విశేషం.

కన్నప్పకు ప్యాన్ ఇండియా భాషల్లో మార్కెట్ ఏర్పడేందుకు ఎక్కువగా దోహదం చేయబోయేది ప్రభాసే. డార్లింగ్ అభిమానులు ఇప్పటికే కన్నప్ప సొంతం చేసుకోవడం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఓపెనింగ్స్ లో తన పాత్ర ఎంత కీలకంగా మారబోతోందో రెండు నెలల్లో చూడొచ్చు.

చాలా అరుదుగా ఇంత స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు పారితోషికం వద్దనే సందర్భాలు కనిపిస్తాయి. 1995లో మోహన్ బాబు పెదరాయుడులో రజనీకాంత్ డబ్బులు ఆశించకుండా అందులో నటించారు. ఆయన క్యారెక్టర్ ఓ రేంజ్ లో పేలింది. బ్లాక్ బస్టర్ కావడానికి గల కారణాల్లో ముందు వరసలో నిలిచింది.

ఇప్పుడు అచ్చం అదే తరహాలో ప్రభాస్ మంచు విష్ణుకి అండగా నిలవడం ఫ్రెండ్ షిప్ కి సాక్ష్యం. ఇటీవలే రిలీజైన శివయ్య లిరికల్ సాంగ్ కు మంచి స్పందన వస్తోంది. విజువల్స్ తో పాటు సంగీతం, సాహిత్యం ఆకట్టుకునేలా ఉన్నాయి. అన్నమయ్యలాగా ప్రతి పాట దైవ చింతనతో చాలా బాగా వచ్చాయని సమాచారం.