సినీ, టీవీ పరిశ్రమలను కరోనా వదలట్లేదు. వైరస్ ప్రభావం గతంతో పోలిస్తే తగ్గి, దాని గురించి జనాలు భయపడటం తగ్గించేసినా.. పూర్తిగా విస్మరించే పరిస్థితి అయితే లేదు. ఇటీవలే చాలా ఉత్సాహంగా షూటింగ్ పున:ప్రారంభించుకున్న ‘టక్ జగదీష్’ టీం.. యూనిట్లో ఒకరికి కరోనా సోకడంతో వెంటనే ప్యాకప్ చెప్పేయడం, అందరూ క్వారంటైన్ అయిపోవడం తెలిసిన సంగతే.
టీవీ రంగంలో కూడా ఇలాంటి పరిణామాలే చాలా జరిగాయి. తాజాగా కరోనా ప్రభావం ఈటీవీలో ప్రసారమయ్యే ఫేమస్ షోలు జబర్దస్త్, ఢీలపై పడింది. ఈ కార్యక్రమాల్లో కీలక వ్యక్తి అయిన సుడిగాలి సుధీర్‌కు కరోనా సోకినట్లు వెల్లడైంది. రెండు రోజులుగా కరోనా లక్షణాలు కనిపిస్తుండటంతో అతను వెళ్లి పరీక్ష చేయించుకున్నాడు. పాజిటివ్‌గా తేలింది. దీంతో జబర్దస్త్, ఢీ ప్రోగ్రాంల నిర్వాహకులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు.
‘ఎక్స్ట్రా జబర్దస్త్’లో సుధీర్‌తో కలిసి స్కిట్లు చేసే రామ్ ప్రసాద్, సన్నీ తదితరులకు కూడా పరీక్షలు నిర్వహించారు. అలాగే ‘ఢీ’ ప్రోగ్రాంలో సుధీర్‌తో సన్నిహితంగా ఉన్న వాళ్లకూ పరీక్షలు జరిపారు. ఎవరికీ పాజిటివ్ లేదనే అంటున్నారు. ఐతే కొన్ని రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు చేయించబోతున్నారు. సుధీర్‌కైతే తీవ్ర లక్షణాలేమీ లేకపోవడంతో అతను హోం క్వారంటైన్లోకి వెళ్లిపోయాడు.
రెండు మూడు వారాలు అతను జబర్దస్త్, ఢీ షోల్లో కనిపించే అవకాశం లేనట్లే. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’లో మొత్తంగా అతడి టీం స్కిట్లే ఆగిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ‘జబర్దస్త్’లో పూర్తిగా హైపర్ ఆది టీం హవా నడిస్తే.. ‘ఎక్స్ట్రా జబర్దస్త్’లో సుధీర్ టీం స్కిట్లే హైలైట్ అవుతుంటాయి. ఆ షోలో వాళ్లదే టాప్ ప్లేస్ అని చెప్పొచ్చు. మరి కొన్ని వారాలు ఈ టీం స్కిట్లు ఆగిపోతే షోకు ఆదరణ తగ్గిపోవడం ఖాయం.