తండేల్ తవ్వి తీసిన పైరసీ చీకటి కోణాలు

ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో జరుగుతున్న చర్చ ఒక్కటే. గేమ్ ఛేంజర్ నుంచి తండేల్ దాకా అసలు హెచ్డి ప్రింట్స్ పైరసీ దారుల చేతికి ఎలా వెళ్తున్నాయని. ఈ సమస్య తీవ్రంగా మారిపోయి ఏకంగా వసూళ్లకే కోత పెట్టే స్థాయికి చేరుకోవడంతో నిర్మాతలకు హెచ్చరిక గంట మ్రోగింది. ఇవాళ నేను, రేపు మరొకరనే భావన ప్రొడ్యూసర్లలో పెరుగుతోంది.

కోట్ల రూపాయల బడ్జెట్, వందలాది మంది కష్టం. నెలలు సంవత్సరాల తరబడి శ్రమ ఇదంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది. ఈ సందర్భంగా బన్నీ వాస్, అల్లు అరవింద్ ప్రెస్ మీట్ ద్వారా కొన్ని కీలకమైన విషయాలు వివరించారు. ఇంతకీ తండేల్ టీమ్ వివరించిన కోణాలేంటో చూద్దాం.

పైరసీ ఎడిటింగ్ రూమ్ లో జరగదు. గీతా గోవిందం, టాక్సివాలా తర్వాత గీతా ఆర్ట్స్ బృందం అలెర్ట్ అయిపోయి సెక్యూరిటీ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఇది అందరు ప్రొడక్షన్ హౌసులు పాటిస్తున్నదే. ఒక్కసారి ఫైనల్ కాపీ బయటికి వెళ్లి థియేటర్ రిలీజ్ కు సిద్ధమయ్యాక అసలు ప్రమాదం మొదలవుతుంది.

ఎక్కడో ఇండియా సైబర్ చట్టాల పరిధిలోకి రాలేని దేశాల నుంచి డీకోడ్ చేసి పైరసీ చేస్తున్నారు. ఒకవేళ ఐపి అడ్రెస్ ని పట్టుకున్నా నిమిషాల వ్యవధిలో కేవలం చిన్న నెంబర్ మార్పుతో తిరిగి చెలామణిలోకి తెస్తున్నారు. రెండేళ్ల నుంచి పైరసీ కంట్రోల్ లో ఉండటం వల్ల సైబర్ సెల్ యాక్టివ్ గా లేకపోవడం ఈ పరిణామానికి మరో కారణం.

గతంలో వెబ్ సైట్లకు మాత్రమే పరిమితమైన పైరసీ ఇప్పుడు వ్యక్తిగత షేర్ల దాకా వెళ్ళిపోయింది. ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ ద్వారా వేగంగా పాకిస్తున్నారు. వీటి అడ్మిన్స్ ని ఇప్పటికే గుర్తించగా డౌన్లోడ్ కాకుండా అవసరమైన చర్యలు మొదలుపెట్టారు. ప్రభుత్వ సహకారం ఉన్నప్పటికీ ఆఫ్రికా లాంటి దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న వాళ్ళను పట్టుకోవడం దుర్లభంగా ఉంది.

ఇకపై అందరూ కలిసికట్టుగా దీని మీద పోరాడాల్సిన అవసరమైతే వచ్చింది. అయినా ఆర్టిసి బస్సులో వీటిని ప్రదర్శించడం దారుణం. తీవ్రంగా పెరిగిపోయింది కాబట్టి ఇకనైనా పైరసీ భూతాన్ని భూస్థాపితం చేసేందుకు చర్యలు చేపట్టడం అవసరం.