విశ్వక్ సేన్ ఆవేదనలో న్యాయముంది

నిన్న జరిగిన లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు 30 ఇయర్స్ పృథ్వి మాటలు ఊహించనంత దుమారం రేపాయి. పదకొండు మేకలంటూ ఒక పార్టీ మీద వ్యంగ్యంగా వేసిన సెటైర్ చాలా దూరం వెళ్లి ఏకంగా సినిమాని బ్యాన్ చేయాలని కొందరు పిలుపు ఇచ్చేదాకా తీసుకెళ్లాయి.

ఏదో ఆషామాషీగా అనుకుంటే లైట్ తీసుకోవచ్చు కానీ ఇంకా ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వేల ట్వీట్లు లైలాకు వ్యతిరేకంగా పడటం షాకింగ్ పరిణామం. దీంతో జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన విశ్వక్, నిర్మాత సాహు గారపాటిలు ప్రెస్ మీట్ పెట్టి జరిగింది వివరించే ప్రయత్నం చేశారు. మనోభావాలు దెబ్బ తిన్నవాళ్లకు సారీ చెప్పారు.

పృథ్వి మాట్లాడే సమయంలో తాము చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్లామని, ఒకవేళ ఎదురుగా కనక జరిగి ఉంటే ఖచ్చితంగా మైకు లాక్కునేవాళ్లమని విశ్వక్ చెప్పడం చూస్తే అందులో లాజిక్ ఉందనిపిస్తోంది. పైగా తమకు నేరుగా ఎలాంటి సంబంధం లేని ప్రసంగంలో రాజకీయ ప్రస్తావన తెచ్చినప్పుడు తన సినిమాను బలి పశువు చేయడం న్యాయం కాదని ఆవేదన స్వరంతో విశ్వక్ వాపోయాడు.

గెస్టుగా వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతారో ముందే తమకు తెలియదని, అలాంటప్పుడు కంట్రోల్ చేయడం సాధ్యం కాదన్న హీరో, నిర్మాత ఒకరు చేసిన తప్పుకు అందరినీ శిక్షించవద్దని కోరుకున్నారు.

ఎలా చూసినా విశ్వక్ సేన్ బాధ పడటంలో అర్థముంది. వాళ్ళ పరిధిలో కట్టడిలో లేని సంఘటనకు నేరుగా టీమ్ ని బాధ్యులను చేయడం సబబు కాదు. అసలు మేకల సీన్ పృథ్వి చెప్పినట్టు సినిమాలో లేదని క్లారిటీ రావడం మరో ట్విస్ట్. ఉద్దేశపూర్వకంగా పొలిటికల్ అజెండాతో కొందరు ఆర్టిస్టులు ఇస్తున్న స్పీచులు చాలా డ్యామేజ్ చేస్తున్నాయి.

సోషల్ మీడియా ట్రెండింగ్ కి ఒక టాపిక్ దొరికితే చాలు క్షణాల్లో వైరలవుతోంది. అలాంటిది ఒక రాజకీయ పార్టీని లక్ష్యంగా చేసుకుని అతి కామెడీ చేస్తే ఇలాగే మిస్ ఫైర్ అయిపోయి ఊహించనంత నష్టం జరుగుతుంది. ఇకనైనా ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం అవసరం.