ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా పెట్టుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే రేపాడు. అప్పట్లో డిజాస్టరై ఇప్పటి జనరేషన్ కు అసలు అవగాహనే లేని సినిమా ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆ సన్నివేశం తాలూకు సందర్భం వీడియో రూపంలో మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంటోంది.
సందీప్ వంగాకు అంతగా నచ్చిందంటే ఇది ఖచ్చితంగా క్లాసిక్ అయ్యుంటుందనే ఉద్దేశంతో యూట్యూబ్ కు వెళ్ళిపోయి చూస్తున్న వాళ్ళు కోకొల్లలు. ఈ నేపథ్యంలో చిరుతో వంగా మూవీ ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది.
ఒక కల్ట్ ఫ్యాన్ గా మెగాస్టార్ తో చేయడానికి సందీప్ వంగా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు కానీ ప్రస్తుతం కార్యరూపం దాల్చే పరిస్థితి కనుచూపు మేరలో లేదు. ఎందుకంటే ప్రభాస్ స్పిరిట్ ఇంకా మొదలుకానేలేదు. స్క్రిప్ట్ సిద్ధమయ్యింది కానీ డేట్స్ కోసం ఎదురు చూస్తోంది.
2027 విడుదల తప్ప అంతకన్నా ముందు ఆశించే ఛాన్స్ లేనట్టే. దీని తర్వాత అల్లు అర్జున్ తో ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టు ఉంది. భద్రకాళి – టి సిరీస్ – గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో ఉంటుంది. దీని స్టోరీ ఇంకా ఫైనల్ కాలేదు. రన్బీర్ కపూర్ డేట్లు దొరగ్గానే యానిమల్ పార్క్ షురూ చేయాలి. ఈ రెండింటిలో ఏది ముందనేది ఇంకా డిసైడ్ కాలేదు.
ఇక్కడ చెప్పిన మూడు సినిమాలు రిలీజయ్యేనాటికి 2030 వచ్చేస్తుంది. అప్పటిదాకా చిరంజీవితో కాంబో ఛాన్స్ లేనట్టేగా. సో ఏది వినిపిస్తున్నా అదంతా పుకారుగానే తీసుకోవాలి. ఇంకోవైపు చిరంజీవి సైతం ఖాళీగా లేరు. విశ్వంభర తర్వాత అనిల్ రావిపూడితో ఓకే అయ్యింది. దాని తర్వాత శ్రీకాంత్ ఓదెల ఫైనల్ నెరేషన్ ఇచ్చేసి సెట్స్ కు తీసుకెళ్ళిపోతాడు.
వాల్తేరు వీరయ్య కాంబినేషన్ రిపీట్ చేస్తూ దర్శకుడు బాబీ కథను వండే పనిలో ఉన్నాడు. ఇలా చూసుకుంటే మెగాస్టార్ ఇంకో రెండేళ్లు లాక్ అయిపోయారు. సో అవకాశమే లేదు. వంగాతో రామ్ చరణ్ కలయిక కూడా వినడానికి బాగుంది కానీ సాధ్యపడే సూచనలు లేవు.