రాంగ్ టైంలో రిలీజ్… దెబ్బ కొడుతోందా?

తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్ తమిళ సినిమాను ఏలుతూ వస్తున్నారు. విజయ్ లాగే అజిత్ సినిమాలు సైతం యావరేజ్ టాక్‌తోనూ భారీ వసూళ్లు సాధిస్తున్నాయి చాలా ఏళ్ల నుంచి. అజిత్ మామూలుగా తన చిత్రాలను అస్సలు ప్రమోట్ చేయడు. ఆయన చిత్రాలకు ప్రమోషనల్ ఈవెంట్లు ఉండవు. కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా ఉండదు.

అయినా అవి భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంటాయి. పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుంటుంది. ఐతే అజిత్ కొత్త చిత్రం ‘విడాముయర్చి’ విషయంలో మాత్రం కొంచెం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది నిజానికి సంక్రాంతికి రావాల్సిన సినిమా. కానీ ‘బ్రేక్ డౌన్’ అనే హాలీవుడ్ మూవీని కాపీ కొట్టి తీసిన విషయం ఒరిజినల్ మేకర్స్‌కు తెలిసిపోయి వాళ్లు కాపీ రైట్ కేసు వేయడం.. దీనికి సంబంధించి సెటిల్మెంట్ జరగడానికి టైం పట్టడం.. ఈ కారణాలతో సినిమా వాయిదా పడింది.

మామూలుగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కాని ఫిబ్రవరిలో ‘విడాముయర్చి’ రిలీజవుతోంది. ఈ టైంలో స్టూడెంట్స్ చదువుల్లో, పరీక్షల్లో బిజీ అయిపోతారు. అందువల్ల ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతుంది. అందుకే చిన్న, మిడ్ రేంజ్ చిత్రాలే రిలీజవుతుంటాయి ఫిబ్రవరిలో. మామూలుగా అజిత్ సినిమాలకు ఉండే హైప్, అడ్వాన్స్ బుకింగ్స్ దీనికి కనిపించడం లేదు. ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ ఉన్నా సోషల్ మీడియాలో దీని గురించి పెద్దగా చర్చ లేదు.

అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. విజయ్ చిత్రం ‘గోట్’తో పోలిస్తే బుకింగ్స్ చాలా డల్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఇక అజిత్ సినిమా తెలుగులో రిలీజవుతున్న సంగతే జనాలకు తెలియట్లేదు. ఈ చిత్రాన్ని ‘పట్టుదల’ పేరుతో విడుదల చేస్తుండగా.. ఇక్కడ ప్రమోషన్ లేదు.

సోషల్ మీడియాలో చర్చా లేదు. అజిత్ నుంచి వచ్చిన గత కొన్ని చిత్రాలకు తెలుగులో ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి. కానీ ‘పట్టుదల’ మాత్రం అస్సలు సౌండ్ చేసేలా కనిపించడం లేదు. మన ఆడియన్స్ దృష్టంతా ‘తండేల్’ మీదే ఉంది.