లేటు వయసులో సినీ రంగంలో మంచి గుర్తింపు సంపాదించిన నటుడు.. గోపరాజు రమణ. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లో హీరో తండ్రి పాత్రలో ఆయన నటించిన విధానం.. ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇండస్ట్రీ కూడా ఇంత మంచి నటుడు ఇన్నాళ్లూ ఎక్కడ ఉండిపోయాడు అన్నట్లుగా ఆయనకు వరుసగా అవకాశాలు ఇచ్చింది. గత నాలుగైదేళ్లలో ఆయన పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. ఐతే ఇటీవల ఆయన అనారోగ్యం పాలైన సంగతి చాలామందికి తెలియదు.
ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. దీంతో సినిమాలకు దూరం అయిపోయారు. కొన్ని నెలల నుంచి సినిమాలు చేయట్లేదు. అంతే కాదు.. అప్పటికే పూర్తి చేసిన సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పలేని పరిస్థితి. ఐతే గోపరాజు రమణకు వాయిస్ కూడా పెద్ద అసెట్. అలాంటి నటుడికి వేరే ఎవరితో అయినా డబ్బింగ్ చెప్పిస్తే సూట్ కాకపోవచ్చు. పాత్రే దెబ్బ తినొచ్చు. ఈ నేపథ్యంలో గోపరాజు పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలకు ఆయన తనయుడు గోపరాజు విజయే డబ్బింగ్ చెబుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గోపరాజు విజయ్ కూడా నటుడే. అతడిదీ మంచి బేస్ వాయిసే. తండ్రి వాయిస్‌కు దగ్గరగా ఉంటుంది కూడా. సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో ప్రెసిడెంట్ పాత్రలో నవ్వించాడు విజయ్. అతను ఇంకా పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాడు. స్వాగ్, కమిటీ కుర్రాళ్లు సహా తండ్రి కీలక పాత్రలు చేసిన ఐదు సినిమాల్లో ఆయనకు విజయే డబ్బింగ్ చెప్పాడట.
వాయిస్ దగ్గరగా ఉండడంతో ఎవరికీ అనుమానమే రాని విధంగా ఆయన మేనేజ్ చేయగలిగాడు. గోపరాజు సర్జరీ పూర్తి అయ్యాక విశ్రాంతి తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన మళ్లీ సినిమాల్లో నటించే అవకాశముంది. కన్నడ సూపర్ స్టార్లలో ఒకడైన పునీత్ రాజ్‌కుమార్ కొన్నేళ్ల ముందు చనిపోతే.. అతడి చివరి చిత్రంలో కొన్ని సన్నివేశాలకు తన అన్నయ్య శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates