శ్రీలంక లెజెండరీ క్రికెటర్ జీవిత కథ ఆధారంగా సినిమా అంటూ వారం కిందట ఆర్భాటంగా ప్రకటించిన చిత్ర బృందం. ప్రపంచ క్రికెట్లో మురళీధరన్ స్థాయి ఏంటో, అతడి ఘనతలు ఎలాంటివో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతడి వ్యక్తిగత జీవితంలోనే కాదు.. క్రికెట్ కెరీర్లోనూ బోలెడంత డ్రామా ఉంది. అనేక మలుపులున్నాయి. దీనికి తోడు మురళీధరన్ పాత్రను చేయబోయేది విజయ్ సేతుపతి కావడంతో ఈ సినిమాపై అందరితోనూ ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఒక మాస్టర్ పీస్ రాబోతోందన్న అంచనాలు ఏర్పడ్డాయి. కానీ వారం తిరిగేసరికి కథ మొత్తం మారిపోయింది.
ఒక తమిళుడై ఉండి శ్రీలంకలో తమిళుల కోసం ఏమీ చేయలేదని, వారికి అన్యాయం చేసిన శ్రీలంక ప్రభుత్వం వైపు నిలిచాడని తమిళనాడు జనం ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకించారు. విజయ్ సేతుపతి మీద తమ ఆగ్రహమంతా సోషల్ మీడియా వేదికగా చూపించారు. నిర్మాణ సంస్థ సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, మురళీధరన్ వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది.
ఇది ఎంతకీ తెగే విషయం కాదని, జనాల దృష్టికోణం మారదని అర్థం చేసుకున్న విజయ్ సేతుపతి.. ఒక సినిమా కోసం తన కెరీర్‌ను పణంగా పెట్టలేక ఆ సినిమా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఊహించని విషయమేమీ కాదు. ఐతే సేతుపతి తప్పుకోవడంతోనే ఈ ప్రాజెక్టు కూడా అటకెక్కేసిందనే చెప్పాలి. ఈ సినిమా తీయదలిచింది తమిళ దర్శకుడు, నిర్మాతలు. బేసిగ్గా తమిళంలో తీసి పలు భాషల్లో అనువదించాలనుకున్నారు. అందులో లంకేయులు సింహళి భాష కూడా ఉంది. కానీ విజయ్ సేతుపతి తప్పుకోవడంతో ఈ సినిమాపై ఆసక్తి సగం తగ్గిపోయింది.
మరే తమిళ నటుడైనా ఈ పాత్ర చేయడానికి వస్తాడా అన్నది సందేహమే. ఎవరు చేసినా తమిళనాట తిరస్కారం తప్పదు. ఆ భాషను విడిచిపెట్టి వేరే లాంగ్వేజెస్‌లో సినిమా తీస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు. మొత్తంగా కీలకమైన ఇండియన్ మార్కెట్‌ను విడిచిపెట్టి ఈ సినిమా చేయాల్సి ఉంటుంది. అది ఆర్థిక కోణంలో చూస్తే సరైన ఆలోచన కాదు. కాబట్టి మంచి డ్రామా. మలుపులు ఉన్న మురళీధరన్ కథ వెండితెరకు ఎక్కడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది.