‘తండేల్’ రేట్లు, షోల సంగతేంటి?

అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ పెద్ద డిజాస్టర్లు అయినా సరే.. ఈ మూవీకి మంచి హైప్ ఉంది. గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థ ఎంతో నమ్మకంతో పెద్ద బడ్జెట్ పెట్టి ఈ సినిమాను నిర్మించడం.. పాటలు, ప్రోమోలు అదిరిపోవడంతో దీనికి హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి బెనిఫిట్ షోలు ఉంటాయా.. రేట్లు పెంచుతారా అనే చర్చ జరుగుతోంది.

దీనికి నిర్మాత బన్నీ వాసు ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ‘తండేల్’ కథ మీద నమ్మకంతో తాము ఏకంగా రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు బన్నీ వాసు తెలిపాడు. ఆ బడ్జెట్ రికవరీ కోసం కొంత మేర టికెట్ల ధరలు పెంచుకోవాలని చూస్తున్నామని.. అది రీజనబుల్‌గానే ఉంటుందని అతను చెబుతున్నాడు. సంధ్య థియేటర్ దుర్ఘటన వలన తెలంగాణలో బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు బ్రేక్ పడింది.

ఈ వ్యవహారంలో కోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ‘తండేల్’కు అర్లీ మార్నింగ్ షోలు, అదనపు రేట్లు ఉండవు. ఇటీవలి కోర్టు ఆదేశాలను అనుసరించి ఉదయం 8.40 నుంచే షోలు మొదలు కానున్నాయి. ఇటీవలి పరిణామాల దృష్ట్యా అదనపు షోలు, రేట్ల కోసం అసలు ప్రభుత్వాన్ని ‘తండేల్’ టీం సంప్రదించనే లేదట. ఏపీలో మాత్రం ఐదో షో, అదనపు రేట్ల కోసం అడుగుతున్నారు.

తొలి రోజు ఉదయం 6-7 గంటల మధ్య ఎక్స్‌ట్రా షోకు అనుమతి రావచ్చు. అలాగే టికెట్ మీద రూ.50 మేర పెంపు కూడా అడుగుతున్నారట. అనుమతులు రావడం కష్టమేమీ కాదు. కాబట్టి సంక్రాంతి సినిమాల మాదిరే ఈ చిత్రానికి కూడా ముందు ఏపీలోనే షోలు పడబోతున్నాయి. అక్కడ సినిమా చూడ్డానికి కొంచెం ఎక్కువ రేటు పెట్టాలి. తెలంగాణలో మాత్రం నార్మల్ రేట్లతోనే సినిమాచూడొచ్చు. అర్లీ మార్నింగ్ షోలు ఉండవు.