నాలుగు సినిమాలకు 100+ మిలియన్ వ్యూస్

ismart Shankar Ram
ismart Shankar Ram

ఇప్పుడు తెలుగు సినిమాలకు బాలీవుడ్‌‌లో క్రేజ్ మామూలుగా లేదు. ఇక్కడ హిట్ అయితే చాలు, ఆ సినిమా రీమేక్ రైట్స్ కోసం తెగ పోటీపడుతున్నారు బాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు. దీనికితోడు యూట్యూబ్‌లో తెలుగు సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్‌లకు బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది.

మొన్నటిదాకా అల్లుఅర్జున్ సినిమాలు యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తే, ఇప్పుడు యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాడు. తాజాగా ఈ కుర్రాడి పేరిట ఓ అరుదైన రికార్డు కూడా క్రియేట్ అయ్యింది.

పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. అప్‌లోడ్ చేసిన రెండు నెలల్లోనే 100 మిలియన్ల వ్యూస్‌తో పాటు మిలియన్‌కి పైగా లైక్స్ కూడా సాధించాడు ‘ఇస్మార్ట్’ మాస్ కుర్రాడు.

ఈ ఊరమాస్ సినిమాకే అనుకుంటే… ఇంతకుముందు రామ్ నటించిన క్లాస్ మూవీస్ ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘హాలో గురూ ప్రేమకోసమే’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌లకు కూడా యూట్యూబ్‌లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో వరుసగా నాలుగు సినిమాలతో 100+ మిలియన్లకు పైగా వ్యూస్, మిలియన్లలో లైక్స్ సాధించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ హీరోగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు రామ్.

యూట్యూబ్‌లో అరుదైన ఫీట్ సాధించడంతో తనకు బాలీవుడ్ జనాల్లో తిరుగులేని ఇమేజ్ వచ్చిందని ఫిక్స్ అయిన రామ్, తన తర్వాతి సినిమాను దేశవ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేసిన ‘రెడ్’ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న రామ్, తన తర్వాతి ప్రాజెక్ట్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అయితే యూట్యూబ్‌ క్రేజ్‌‌ను దృష్టిలో ఉంచుకుని భారీ బడ్జెట్‌తో ఓ పాన్ ఇండియా మూవీ చేయాలని ఈ యంగ్ ఎనర్జిక్ హీరో ఫిక్స్ అయినట్టు టాక్.