వీడు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ కొడతాడని సంక్రాంతికి వస్తున్నాంలో ఉపేంద్ర లిమయే చెప్పిన డైలాగ్ ని వెంకటేష్ నిజం చేసేశారు. సగర్వంగా మూడు వందల కోట్ల క్లబ్బులో అడుగు పెట్టేశారు. ప్యాన్ ఇండియా రిలీజ్ లేకుండా కేవలం సింగల్ లాంగ్వేజ్ వెర్షన్ తో ఇంత భారీగా వసూలు చేసిన సీనియర్ హీరోగా విజయ పతాకం ఎగరేశారు.
ఇంకా దూకుడు అయిపోలేదు. ఈ వీకెండ్ కూడా పూర్తిగా వెంకీ కంట్రోల్ లోకి రాబోతోంది. ఇరవై రోజులకు దగ్గరవుతున్నా హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడం పుష్ప 2 ది రూల్ తర్వాత స సంక్రాంతికి వస్తున్నాంకే కనిపిస్తోంది. ర్యాంపేజ్ ఆ స్థాయిలో ఉంది మరి.
ఇక్కడ ప్రధానంగా మూడు కారణాలు చెప్పుకోవాలి. మొదటిది వెంకటేష్. ఎప్పటిలాగే తన టైమింగ్ తో వైడి రాజు రాజు పాత్రని నిలబెట్టడమే కాక తన డాన్సు, శరీరం మీద జోకులు వేసుకునే స్వేచ్ఛ దర్శకుడికి ఇవ్వడం ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యే అవకాశాన్ని తీసుకున్నాడు.
అలాని ఫ్యాన్స్ నిరాశపర్చకుండా ఇంట్రో, క్లైమాక్స్ లో వాళ్లకు కావాల్సిన మసాలాలు మోతాదు మించకుండా ఇవ్వడం స్థాయిని పెంచింది. రెండో కారణం అనిల్ రావిపూడి. ఆరిస్టుల ఎంపికతో మొదలుపెట్టి వాళ్ళ నుంచి కామెడీ రాబట్టుకోవడంలో ఆయన పడిన తపన వంద శాతానికి మించిన ఫలితాన్ని ఇచ్చింది.
ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్, చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమల లాంటి క్యాస్టింగ్ ని వాడుకున్న వైనం అదిరిపోయింది. పరిమిత బడ్జెట్ తో ఎక్కువ వేస్టేజి లేకుండా వేగంగా పూర్తి చేయడం నిర్మాత దిల్ రాజు మీద భారం తగ్గించింది. ఇక మూడో కారణం భీమ్స్ పాటలు. గోదారి గట్టు కోసమే మొదటి రోజు థియేటర్ కొచ్చిన ప్రేక్షకులు కోకొల్లలు.
వాళ్ళ అంచనాలకు మించి కంటెంట్ ఉండటంతో మౌత్ టాక్ వైరల్ గా పెరిగిపోయింది. మాస్ సైతం డాకు మహారాజ్ కన్నా ముందు దీనికి ప్రాధాన్యం ఇవ్వడం అసలైన విశేషం. మూడే సాంగ్స్ ఉన్నప్పటికీ దేనికవే ఒకదాన్ని మించి మరొకటి చార్ట్ బస్టర్ కావడం ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకే సాధ్యపడలేదు.