ఇండియాలో బెస్ట్ వెబ్ సిరీస్ ఇదేనట..

ఇండియాలో వెబ్ సిరీస్ కల్చర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. లాక్ డౌన్ టైంలో ఓటీటీల ప్రాధాన్యమేంటో అందరికీ తెలిసొచ్చింది. దీంతో ఇంతకుముందు ఓటీటీలను, అందులో వచ్చే వెబ్ సిరీస్‌లను తక్కువగా చూసిన వాళ్లందరూ ఇప్పుడు ఆలోచన మార్చుకున్నారు. వివిధ భాషల్లో పేరున్న ఆర్టిస్టుల, టెక్నీషియన్లు వెబ్ సిరీస్‌ల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

థియేటర్ల పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతుండటం, కరోనా ఆ రంగాన్ని దారుణంగా దెబ్బ తీయడం.. ఈ నేపథ్యంలో మున్ముందు ఓటీటీలు, అందులో వచ్చే వెబ్ సిరీస్‌ల ప్రభావం మరింత పెరగబోతున్నాయన్నది స్పష్టం. ఈ నేపథ్యంలోనే వివిధ భాషల్లో వెబ్ సిరీస్‌ల స్థాయి పెరుగుతోంది. సినిమాలకు ఏమాత్రం తీసిపోని క్వాలిటీతో వాటిని తెరకెక్కించే ప్రయత్నం జరుగుతోంది. తాజాగా కంటెంట్ విషయంలో అదిరిపోయే క్వాలిటీతో ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అదే.. స్కామ్ 1992.

90వ దశకంలో స్టాక్ మార్కెట్లో భారీ కుంభకోణంతో సంచలనం రేపిన హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది. షాహిద్, సిటీ లైట్స్, అలీగఢ్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక పంథాను నిర్మించుకున్న సీనియర్ దర్శకుడు హన్సల్ మెహతా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించాడు. ప్రతీక్ గాంధీ ఇందులో హర్షద్ మెహతా పాత్రను పోషించాడు.

పెద్దగా అంచనాల్లేకుండా సోనీ లైవ్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబట్టుకుంటోంది. చూసిన వాళ్లందరూ దీన్నో మాస్టర్‌ పీస్‌గా అభివర్ణిస్తున్నారు. ఇండియాలో ఇప్పటిదాకా తెరకెక్కిన అన్ని వెబ్ సిరీస్‌ల్లో ఇదే ది బెస్ట్ అని క్రిటిక్స్ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తుండటం విశేషం. ఒక బాలీవుడ్ క్రిటిక్ అయితే.. దీని స్క్రిప్టుతో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్లలో పాఠాలు చెప్పాలని వ్యాఖ్యానించాడు. సేక్రెడ్ గేమ్స్, మీర్జా పూర్, ఫ్యామిలీ మ్యాన్, పాతాళ్ లోక్, స్పెషల్ ఆప్స్ లాంటి టాప్ క్వాలిటీ వెబ్ సిరీస్‌లుండగా వాటిని కాదని దీన్ని ‘ది బెస్ట్’ అంటున్నారంటే ఇందులో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే.