ఇంతకుముందు అనేక వివాదాస్పద అంశాల మీద సినిమాలొచ్చేవి. సినిమాల ద్వారా అనేక విషయాలను చర్చించేవాళ్లు. కానీ ఈ మధ్య ఆ పరిస్థితి ఉండట్లేదన్నది వాస్తవం. సోషల్ మీడియా కాలంలో జనాల్లో మరీ సున్నితత్వం పెరిగిపోయిందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి వివిధ పరిణామాలు చూస్తుంటే. సినిమాల్లో చిన్న చిన్న విషయాల్ని పట్టుకుని పెద్ద వివాదం చేయడం మామూలైపోయింది. బూతద్దం పెట్టి వెతికి మరీ చిన్న విషయాన్ని పట్టుకుని, మనోభావాలు దెబ్బ తీసేసుకుంటున్నారు జనాలు.
ముఖ్యంగా కులం, మతం సంబంధిత విషయాల్లో జనాలు మరీ సున్నితంగా మారిపోతున్నట్లు అనిపిస్తోంది కొన్ని వ్యవహారాలు చూస్తుంటే. వచ్చే నెలలో దీపావళి కానుకగా అక్షయ్ కుమార్ సినిమా ‘లక్ష్మీబాంబ్’ హాట్‌స్టార్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఉద్యమం నడుస్తుండటం గమనార్హం.
ఈ ఆందోళన చేస్తున్న వారి తొలి అభ్యంతరం.. సినిమా టైటిల్. లక్ష్మీబాంబ్ అని టైటిల్ పెట్టడం ద్వారా.. లక్ష్మీదేవిని అవమానించిందట చిత్ర బృందం. ఇక రెండో అభ్యంతరం ఏంటంటే.. ఈ చిత్రంలో హీరోకు అసిఫ్ అని, హీరోయిన్‌కు ప్రియా యాదవ్ అని పేర్లు పెట్టడం. ముస్లిం అబ్బాయి, హిందూ అమ్మాయికి మధ్య ప్రేమను చూపించి లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తున్నారంటూ హిందూ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ హీరోయిన్ను ముస్లింగా, హీరోను హిందువుగా చూపించే సాహసం చేయగలరా అని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు అక్షయ్ కుమార్ భారతీయ పౌరుడే కాదని, అతను కెనడియన్ అని కొందరు విమర్శిస్తుంటే.. ఇంకొందరేమో పాకిస్థాన్ అమ్మాయి మలాలాను అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా గతంలో ఇంటర్వ్యూ చేయడాన్ని ఆక్షేపిస్తున్నారు. అంతే కాక ఇంతకుముందు ‘ఓ మై గాడ్’ ప్రమోషన్లలో భాగంగా ఆ సినిమా కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ విగ్రహాల మీద పాలు పోసి వృథా చేయడాన్ని తప్పుబట్టాడు. ఆ విషయాలన్నీ ఇప్పుడు తీసుకొచ్చి ‘లక్ష్మీబాంబ్’ను బహిష్కరించాలంటూ ఉద్యమం చేస్తున్నారు ఓ వర్గం నెటిజన్లు.