గౌతమ్ మీనన్ షాకింగ్ కామెంట్స్

తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన నిర్మాణ సంస్థ ఫాంటన్ ఫిలిమ్స్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడంతో తన సినిమాలు వరుసగా పెండింగ్‌లో పడ్డాయి. అందులో ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాడు కానీ.. తన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధృవ నక్షత్రం’, ప్రొడ్యూస్ చేసిన ‘నరకాసురన్’ అనే చిత్రాలకు మాత్రం మోక్షం లభించట్లేదు.

ఐతే ఇలాంటి సమయంలో కొంచెం దూకుడు తగ్గించాల్సిన ఆయన.. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తీసిన ‘డొమినిక్’ రిలీజ్ సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో చాలా యారొగెంట్‌గా మాట్లాడి ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ధనుష్‌తో తాను తీసిన ఫ్లాప్ మూవీ ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ చిత్రంతో తనకే సంబంధం లేదన్నట్లు మాట్లాడడం వివాదాస్పదమైంది.

ఇప్పుడు మొత్తంగా కోలీవుడ్ హీరోలనే టార్గెట్ చేస్తూ గౌతమ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కోలీవుడ్ హీరోలకు బడ్జెట్ మీదే దృష్టి అని, కథలను పట్టించుకోరని ఆయన కామెంట్ చేశారు. ‘‘నిజం చెప్పాలంటే సినిమాలకు పెద్దగా బడ్జెట్ అవసరం లేదు. దాని కంటే కంటెంట్ ముఖ్యం. వంద కోట్లతో ఒక్క సినిమా తీయడం కంటే.. పది కోట్ల చొప్పున పది మంచి సినిమాలు తీయడం మంచిది.

కానీ కోలీవుడ్ స్టార్లు చాలామంది భారీ బడ్జెట్ సినిమాల్లో మాత్రమే నటించాలని కోరుకుంటున్నారు. స్క్రిప్టు గురించి పట్టించుకోరు. నేను నా కథలను మలయాళంలో తీయాలని కోరుకుంటాను. ఎందుకంటే ఇలాంటి కథలకు తమిళ నటులు ఓకే చెప్పరు. మలయాళంలో కథలకే ప్రాధాన్యం ఇస్తారు. మలయాళంలో ఏదైనా సినిమా విజయం సాధిస్తే మాత్రం దాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఒరిజినల్ స్క్రిప్టులను మాత్రం అంగీకరించరు’’ అంటూ కోలీవుడ్ హీరోల తీరును దుయ్యబట్టాడు గౌతమ్.

ఐతే ఈ కామెంట్స్ చేశాక వచ్చే వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని తాను ఇకపై తమిళంలో సినిమాలు తీయలేకపోవచ్చని గౌతమ్ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.