రౌడీ బాయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విజయ్ దేవరకొండ 12 విడుదల తేదీని మే 30కి లాక్ చేసినట్టు సమాచారం. గతంలో మార్చి నెలఖారుకి ప్లాన్ చేసుకున్నారు కానీ పలు కారణాల వల్ల నిర్ణయం మార్చుకున్నారు. అవేంటో చూద్దాం.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దీనికన్నా ముందు ఇదే సితార బ్యానర్ కు చేస్తున్న మేజిక్ ని పూర్తి చేసే పనుల్లో ఉన్నాడు. ఇటీవలే అనిరుద్ రవిచందర్ హైదరాబాద్ వచ్చి దీనికి సంబంధించిన పనులను చూసుకుని వెళ్ళాడు. ఒక కాన్సెప్ట్ వీడియో కూడా షూట్ చేశారట. అలాని విడి 12కి బ్రేక్ పడలేదు. నిర్విరామంగా ప్లాన్ ప్రకారమే జరుగుతోంది.
కాకపోతే మార్చి, ఏప్రిల్ నెలల్లో పోటీ ఎక్కువగా ఉంది. పైగా సితార సంస్థ నుంచే వస్తున్న మ్యాడ్ స్క్వేర్ కి తగినంత ప్రమోషన్లు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. విజయ్ దేవరకొండ 12 మీద భారీ బడ్జెట్ పెట్టారు. రికవర్ కావాలంటే సోలో రిలీజ్ చాలా ముఖ్యంగా.
ఈ మధ్య కాలం నిర్మాత నాగవంశీ ఎంత మంచి సినిమాలు చేస్తున్నా పోటీ వల్ల వసూళ్లు ప్రభావితం చెందుతున్నాయి. డాకు మహారాజ్ మీద సంక్రాంతికి వస్తున్నాం ఎఫెక్ట్ చూశాం. లక్కీ భాస్కర్ కి ఇతర భాషల్లో అమరన్ వేసిన గండి చిన్నది కాదు. గుంటూరు కారం సైతం హనుమాన్ వల్ల ప్రభావితం చెంది వసూళ్ల తగ్గుదల చూసింది.
అలాంటి సమస్య విడి 12కి రాకూడదనేది సితార టీమ్ సంకల్పం. మే 9 రవితేజ మాస్ జాతరను ముందే షెడ్యూల్ చేసుకున్నారు కానీ విశ్వంభర అదే డేట్ కి వస్తుందా రాదా అనే దాన్ని బట్టి డెసిషన్ మారొచ్చు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని మే ఆఖరుకు వెళ్లిపోవడం తెలివైన నిర్ణయం.
వరస ఫ్లాపులతో కుదేలైన విజయ్ దేవరకొండ ఇది పవర్ ఫుల్ కంబ్యాక్ అవుతుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది. శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో ఎవరూ ఊహించలేని కథాంశంతో రెండు భాగాలుగా ఇది రానుంది. బ్లాక్ బస్టర్ కు తగ్గదనే కాన్ఫిడెన్స్ తో ముందే సీక్వెల్ ప్లాన్ చేసుకున్నారట. దీనికి కూడా అనిరుద్ రవిచందరే సంగీతం అందిస్తున్నాడు.