ఇంటరెస్టింగ్ : సార్ కలయికలో ‘హానెస్ట్ రాజ్’

కెరీర్ ప్రారంభంలో లవ్ స్టోరీలే చూపించి తొలిప్రేమ తప్ప మిగిలిన వాటితో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన దర్శకుడు వెంకీ అట్లూరి ఎప్పుడైతే పీరియడ్ ఫిలింస్ పేరుతో ఎనభై తొంబై దశకంలోకి తీసుకెళ్తున్నాడో అప్పటి నుంచి బండి మాములు స్పీడ్ తో పరిగెత్తడం లేదు. ఇటీవలే లక్కీ భాస్కర్ ఎంత విజయం సాధించిందో చూశాం. దుల్కర్ సల్మాన్ కు మొదటి వంద కోట్ల గ్రాసర్ గా తెలుగు, మలయాళంతో పాటు అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అందుకుంది. దీనికన్నా ముందు ధనుష్ తో తెరకెక్కించిన సార్ కూడా ప్రశంసలు, వసూళ్లు రెండూ అందుకుంది. ఇప్పుడీ కలయిక రిపీట్ కానుంది.

లక్కీ భాస్కర్, సార్ నిర్మించిన సితార ఎంటర్ టైన్మెంట్స్ మూడోసారి వెంకీ అట్లూరితో చేతులు కలిపింది. ధనుష్ హీరోగా మళ్ళీ రాబోతున్నాడు. హానెస్ట్ రాజ్ టైటిల్ ని లాక్ చేసినట్టు సమాచారం. ఇది కూడా వెనకటి నేపథ్యంలోనే ఉంటుందని వినికిడి. నిజాయితీకి మారుపేరైన ఒక ప్రభుత్వ ఉద్యోగి చుట్టూ తిరిగే డ్రామాగా చెబుతున్నారు. అధికారికంగా వెల్లడి కాలేదు కాబట్టి ఇంకా వేచి చూడాలి. ధనుష్ గత ఏడాది స్వీయ దర్శకత్వంలో రాయన్ రూపంలో హిట్ అందుకున్నాక వచ్చే నెల ఫిబ్రవరిలో తన డైరెక్షన్ లో రూపొందిన జాబిలమ్మ నీకు అంత కోపమా రిలీజ్ కానుంది. ఏప్రిల్ లో ఇడ్లీ కడాయ్ వస్తుంది.

ఇక వెంకీ అట్లూరి విషయానికి వస్తే సూర్యతో మారుతీ రూపకర్త బయోపిక్ తో ఏదో కథ రాసుకున్నాడనే టాక్ వచ్చింది కానీ అది పుకారు దగ్గరే ఆగిపోయింది. సూర్య రెట్రో తర్వాత ఆర్జె బాలాజీ సినిమా చేస్తున్నాడు. వెట్రిమారన్ వాడివసల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సో ఈ కాంబో లేనట్టే. మోక్షజ్ఞని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తాడనే టాక్ వచ్చింది కూడా అది కూడా డౌట్ గానే ఉంది. మొత్తానికి హానెస్ట్ రాజ్ అనేది పేరు నుంచే ఆసక్తి రేపుతోంది. లక్కీ భాస్కర్ లో ఒక బ్యాంక్ ఎంప్లాయ్ కుటుంబం కోసం అవినీతి చేస్తే ఎలా ఉంటుందో జనం బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు నిజాయితీ అంటున్నారు కాబట్టి ఇదెలా ఉండబోతోందో.