స‌ల్మాన్ మ‌సాలా రెడీ అమ్మా

https://www.youtube.com/watch?v=V1q3OW1R-6k

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా థియేటర్లలోకి వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఉండే సందడే వేరు. ముఖ్యంగా నార్త్ ఇండియా అంతటా బాక్సాఫీస్ షేకైపోతుంది. టాక్‌తో సంబంధం లేకుండా సల్మాన్ సినిమాలు భారీ వసూళ్లు రాబడతాయి. ప్రతి సంవత్సరం రంజాన్ రోజు సల్మాన్ తన సినిమాను రెడీగా ఉంచుతాడు. ఇది చాలా ఏళ్లుగా నడుస్తున్న ఆనవాయితీ. ఈ ఏడాది ఈద్ కోసం కూడా ఒక సినిమాను పట్టాలెక్కించాడు గత ఏడాది.

ముందు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశాడు కానీ.. అది వర్కవుట్ కాలేదు. దీంతో తనతో వాంటెడ్, దబంగ్-3 సినిమాలు తీసిన ప్రభుదేవా డైరెక్షన్లో వెంటనే ‘రాధె’ చిత్రాన్ని ప్రకటించాడు. అంతా అనుకున్న ప్రకారం జరిగితే మేలో రంజాన్ కానుకగా ఆ సినిమా రావాల్సింది. కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది.

కొన్ని నెలల పాటు ఖాళీగా ఉన్న సల్మాన్.. మళ్లీ పరిస్థితులు చక్కబడగానే షూటింగ్‌కు వెళ్లిపోయాడు. చాలా తక్కువ రోజుల్లోనే శరవేగంగా ‘రాధె’ సినిమాను పూర్తి చేసేశాడు. షూటింగ్ పూర్తయినట్లు ఒక వీడియోను కూడా అతను షేర్ చేశాడు. సల్మాన్ ఇంత వేగంగా సినిమాను ఫినిష్ చేసేస్తాడని అభిమానులు ఊహించలేదు. థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీతో నడవడం మొదలవగానే, సాధ్యమైంత త్వరగా ‘రాధె’ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుందని భావిస్తున్నారు.

ఆల్రెడీ సూర్యవంశీ, 83 లాంటి భారీ చిత్రాలు విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు వాటికి ‘రాధె’ కూడా తోడవుతున్నట్లే. కరోనా ధాటికి నైరాశ్యంలో కూరుకుపోయిన బాలీవుడ్‌లో మళ్లీ ఉత్సాహం నిండాలంటే సల్మాన్ సినిమా రావాల్సిందే. ‘రాధె’లో సల్మాన్ మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో దిశా పఠాని కథానాయిక.