మహిళా కమిషన్ నోటీసులు : దర్శకుడి క్షమాపణ

దర్శకుడు త్రినాథరావు పేరు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. తన కొత్త చిత్రం ‘మజాకా’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే అందుక్కారణం. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు ఫిజిక్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

అన్షు ఒకప్పటితో పోలిస్తే సన్నబడిందని చెబుతూ.. ఇలా ఉంటే తెలుగులో కుదరదని, బరువు పెరగాలని పేర్కొంటూ సైజులు పెరగాలి అనే కామెంట్ చేయడంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ రోజు ఉదయానికి వ్యవహారం చాలా పెద్దదైపోయింది. త్రినాథరావు బాగా అన్ పాపులర్ అయిపోయారు. వ్యవహారం మహిళా కమిషన్ వరకు వెళ్లిపోయింది.

ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహిళా కమిషన్.. త్రినాథరావుకు నోటీసులు ఇచ్చింది.వ్యవహారం తీవ్రతను అర్థం చేసుకున్న త్రినాథరావు ఆలస్యం చేయకుండా క్షమాపణలు చెప్పేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అన్షుతో పాటు నా వ్యాఖ్యల వల్ల బాధ పడ్డ మహిళలు అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నా. నా ఉద్దేశం ఎవరినీ బాధ పెట్టడం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. మీరంతా పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నా’’ అని త్రినాథరావు పేర్కొన్నారు.

మరి ఇంతటితో వ్యవహారం సద్దుమణుగుతుందా.. ఇంకేమైనా జరుగుతుందా అన్నది చూడాలి. వరుసగా విజయాలతో ఊపుమీదున్న త్రినాథరావు ఈ వివాదాన్ని కోరి తెచ్చుకున్నారు. ‘మజాకా’ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ మూవీలో అన్షు, రీతూ వర్మ, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషించారు.