చిన్మయి వెర్సస్ వైరముత్తు వ్యవహారం ఇప్పటిది కాదు. రెండేళ్ల కిందట మీ టూ మూమెంట్ మొదలైన కొత్తలో ఆమె ఆ దిగ్గజ గేయ రచయిత మీద సంచలన ఆరోపణలు చేసింది. తనకు 18 ఏళ్ల వయసుండగా వైరముత్తు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, తనను లోబరుచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించినట్లు ఆరోపించింది. ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వైరముత్తు తనను ఇబ్బంది పెట్టినట్లు వెల్లడించింది.
అలాగే వైరముత్తు ద్వారా ఇబ్బంది పడ్డ అనేకమంది అనుభవాల్ని ఆమె ఎప్పట్నుంచో సోషల్ మీడియాలో పంచుకుంటూ వస్తోంది.. వాళ్లందరి తరఫున పోరాడుతోంది. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు ఇప్పటిదాకా వైరముత్తుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దగా స్పందన లేదు.
అయినా సరే.. చిన్మయి మాత్రం తన పోరాటాన్ని ఆపట్లేదు. తాను వైరముత్తు మీద ఆరోపణలు చేసి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆమె మరోసారి ఆయన నైజాన్ని బయటపెట్టే ప్రయత్నం చేసింది. పేరు చెప్పుకోలేని ఒక మహిళ.. వైరముత్తు వల్ల ఎలా ఇబ్బంది పడిందో వెలుగులోకి తెచ్చింది. ఆమె తనకు పెట్టిన మెసేజ్‌లను స్క్రీన్ షాట్లు తీసి చిన్మయి ట్విట్టర్లో షేర్ చేసింది.
తాను కాలేజీ రోజుల్లో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లానని.. అప్పుడు వైరముత్తు ఆటోగ్రాఫ్ అడిగితే.. ఆయన తన నంబర్ కూడా రాసిచ్చారని.. తర్వాత తాను ఓ ఛానెల్లో పని చేస్తున్నపుడు తన నంబర్ తీసుకుని అదే పనిగా ఫోన్లు చేయడం మొదలుపెట్టారని, తననో చోటుకు రమ్మని మెసేజ్‌లు కూడా పెట్టారని బాధితురాలు పేర్కొంది. గంటలో 50సార్లు ఫోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్న ఆమె.. చివరికి తన బాధ తెలుసుకున్న ఛానెల్ యాజమాన్యం వైరముత్తు భార్యకు విషయం చెబితే.. ఆమె ఆయనకు అడ్డుకట్ట వేసినట్లు ఆమె వెల్లడించింది. ఈ మహిళ తన బాధ చెప్పుకోవడానికి రెండేళ్లు పట్టిందని.. కానీ ఇలాంటి సమస్యల్ని మన సమాజం పట్టించుకోదని ఆవేదన వ్యక్తం చేసింది చిన్మయి.