ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని సినిమాలను రోజుకు ఆరు షోల మేర ప్రదర్శించుకునే వెసులుబాటు ఉండేది. వీటిలో రెండు షోలను బెనిఫిట్ షోలుగా మలచుకుని నిర్మాతలు ఓ మోస్తరు గట్టెక్కేవారు. అయితే ఇకపై ఏపీలో ఆరు షోలకు అనుమతి లేదు. రోజుకు ఐదు ఫోలకు మాత్రమే అనుమతి లభిస్తుంది. అది కూడా సినిమా రిలీజ్ అయిన తొలి 10 రోజులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. ఆ తర్వాత యథాప్రకారం రోజుకు 4 షోలకే అవకాశం ఉంది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలతో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కూటమి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం… ఈ సంక్రాంతికి విడుదల అయిన, విడుదల కానున్న చిత్రాలపై పెను ప్రభావమే పడనుందని తెలుస్తోంది. ఇప్పటికే గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్ సినిమా శుక్రవారమే రిలీజ్ అయ్యింది. ఇక నందమూరి నటసింహం, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ 3 సినిమాలపై సర్కారు సరకొత్త నిబంధనలు ఓ రేంజిలో ప్రబావం చూపే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే రిలీజ్ సినిమాల టికెట్ల రేట్ల పెంపు, రోజుకు పరిమితికి మించి షోలను ప్రదర్శిస్తున్న తీరును నిరసిస్తూ ఏపీ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా రేట్ల పెంపును 10 రోజులకు పరిమితం చేసిన కోర్టు… సరైన భద్రత లేకుండా అర్ధరాత్రుల్లో కొనసాగే సినిమా ప్రదర్శనల వల్ల ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాలు, సలహాలను పరిగణనలోకి తీసుకున్న సర్కారు… అర్థరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటలకు ప్రదర్శితం అవుతున్న షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
సంక్రాంతికి వస్తున్నాం… సినిమాను అలా పక్కనపెడితే ఇప్పటికే రిలీజ్ అయిన గేమ్ ఛేంజర్ సినిమాను రోజుకు ఆరు షోల చొప్పున టికెట్లు విక్రయించినట్లుగా సమాచారం. మరి సర్కారు కొత్త మార్గదర్శకాలు ఈ సినిమాకు వర్తిస్తాయా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే సర్కారు కొత్త నిబంధనలు విడుదల అయ్యే సమయానికే ఈ సినిమా రిలీజ్ అయిపోయింది. ఇక డాకు మహారాజ్ సినిమాను తెల్లవారుజామున 4 గంటలకు ప్రదర్శించేలా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుక్ మై షోలో టికెట్టు అమ్ముడైపోయాయి. ఇప్పుడు ఆ షో రద్దు కాగా… ఆ షో టికెట్లు కొన్న వారికి చిత్ర బృందం గానీ, ఆయా థియేటర్ల యాజమాన్యాలు గానీ ఎలా సర్ది చెబుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.