ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా నిర్వహించారు కానీ మారిపోయిన ఇప్పటి పరిస్థితుల్లో ఇది చాలా రిస్క్ తో కూడుకున్నది. అందుకే రెండో తరానికి చెందిన మన సీనియర్ స్టార్లు డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. కానీ సోనూ సూద్ పెద్ద సాహసమే చేస్తున్నాడు. తనే హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా మారి తీసిన ఫతే రేపు రిలీజవుతోంది. చాలా కాలంగా తను కథానాయకుడిగా చేయడం లేదు. అందుకే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే అనుమానం ట్రేడ్ లో లేకపోలేదు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి.
నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి సోను సూద్ చాలా కష్టపడ్డాడు. అమెరికాలో కొంత భాగం షూట్ చేయాల్సి వస్తే ఆ ఎపిసోడ్ కు అవసరమైన తారాగణంతో పాటు ఒక్కడే అక్కడికి వెళ్లి లొకేషన్లు చూసుకున్నాడు. లోకల్ గా ఒక పన్నెండు మందిని జీతానికి మాట్లాడుకుని చిత్రీకరణ జరిపాడు. శాన్ఫ్రానిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మీద అనుమతుల కోసం అష్టకష్టాలు పడ్డాడు. దుబాయ్ లో కొంత భాగం తీయాల్సి వస్తే ఇండియా నుంచి కేవలం ఆరుగురితో వెళ్లి పూర్తి చేసుకుని వచ్చాడు. ఒక ఆర్టిస్టు ఉదయం షూట్ ఉంటే మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చినా అవన్నీ భరించి ఫతేని థియేటర్ల దాకా తీసుకురాగలిగాడు.
అరుంధతి విలన్ గా మనకు దగ్గరైన సోను సూద్ కు కరోనా సమయంలో పబ్లిక్ ఇమేజ్ బాగా పెరిగింది. ఆపదలో ఉన్న వాళ్లకు కోట్ల రూపాయల విలువైన సహాయాలు చేసి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు. అందుకే ఫతే మీద ఆ సింపతీ వర్కౌట్ అవుతుందని బయ్యర్లు భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ లాంటి పోటీ ఉన్నా సరే బుక్ మై షోలో సగటున గంటకు పదిహేను వందలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అంటే ఆడియన్స్ లో అంతో ఇంతో దీని మీద ఆసక్తి ఉన్న విషయం అర్థమైపోతుంది. జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్ గా నటించిన ఫతే కనక హిట్ అయితే సోను సూద్ కు హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైనట్టే.