ట్రెండుని పట్టేసుకున్న బెల్లంకొండ ‘హైందవ’

అల్లుడు అదుర్స్ తర్వాత తెలుగులో దర్శనం లేకుండా మాయమైపోయిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ కోసం విలువైన సమయాన్ని బోలెడు ఖర్చు పెట్టాడు. అయినా ఫలితం దక్కలేదు కానీ తర్వాత టాలీవుడ్ కెరీర్ వైపు సీరియస్ గా దృష్టి పెట్టాడు. ఒకేసారి నాలుగు సినిమాలకు కమిటై యమా బిజీగా ఉన్నాడు. వాటిలో మొదటిది భైరవం ఫిబ్రవరిలో విడుదల కానుంది. తమిళ సూపర్ హిట్ గరుడన్ రీమేక్ గా రూపొందిన ఈ విలేజ్ డ్రామాలో నారా రోహిత్, మంచు మనోజ్ తో కలిసి స్క్రీన్ పంచుకున్నాడు. ఇవాళ మరో కొత్త మూవీహైందవ టీజర్ ని లాంఛ్ చేశారు. కాన్సెప్ట్ ఏంటో చూపించారు.

అనగనగా వందల సంవత్సరాల నాటి ఒక పురాతన గుడి. దాని మీద దుండగుల కన్ను పడుతుంది. ఏకంగా దాన్ని తగలబెట్టే సాహసం చేస్తారు. ఎక్కడ ఉంటాడో ఎక్కడి నుంచి వచ్చాడో అర్థం కానంత వేగంగా దూసుకొస్తాడో యువకుడు. తోడుగా సింహం, వరాహం వెంట వచ్చి అడవులో కాచుకున్న దుర్మార్గుల భరతం పట్టేందుకు కాపు కాస్తాయి. శ్రీవిష్ణు నామాల సాక్షాత్కారం జరిగిన ఈ అద్భుత సంఘటన వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే హైందవ చూడాలి. ప్యాన్ ఇండియా భాషల్లో తీస్తున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ విడుదల తేదీ ఇంకా నిర్ణయించలేదు కానీ కాన్సెప్ట్ అయితే ఆసక్తికరంగా ఉంది.

ఇప్పుడున్న ట్రెండ్ కు తగ్గట్టే సాయిశ్రీనివాస్ చేసుకుంటున్న సెలక్షన్ కోరుకున్న ఫలితాలు ఇచ్చేలా ఉంది. భైరవం కూడా గుడి బ్యాక్ డ్రాప్ లోనే జరగడం గమనార్హం. ఊరు పేరు భైరవకోన, విరూపాక్ష, మా ఊరి పొలిమేర 2, క లాంటి సూపర్ హిట్లన్నీ ఈ ఫార్ములాని అనుసరించి సక్సెస్ అయినవే. హైందవ కూడా అదే దారిలో వెళ్తున్నట్టు కనిపిస్తోంది. బెల్లం హీరో మరో సినిమా టైసన్ నాయుడు ఇదే సంవత్సరం థియేటర్లకు వచ్చేందుకు రెడీ అవుతోంది. కౌశిక్ దర్శకత్వంలో ఇంకో ఫాంటసీ మూవీ నిర్మాణంలో ఉంది. హైందవ దర్శకుడు లుదీర్ బైరెడ్డి. విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో వచ్చే ఏడాది రావొచ్చు.