తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక అదనపు షోలు, రేట్లు తెచ్చుకోవడం చాలా ఈజీ అయిపోయింది. తెలంగాణలో ఏడాదికి పైగా కోరుకున్న షోలు, రేట్లు వచ్చాయి. ఏపీలో ఆరు నెలలుగా అంతా సాఫీగా సాగిపోతోంది. ఈ క్రమంలోనే ‘పుష్ప-2’ చిత్రానికి రికార్డు స్థాయి రేట్లు వచ్చాయి. కానీ ‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటనతో తెలంగాణలో కథ మారిపోయింది. ఆ ఉదంతం నేపథ్యంలో తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు అనుమతులు ఉండవని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఐతే సంక్రాంతి సినిమాల రిలీజ్ టైంకి పరిస్థితులు మారతాయని ఆశించారు. కానీ అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు. ఏపీలో ఆల్రెడీ గేమ్ చేంజర్, డాకు మహారాజ్ చిత్రాలకు అదనపు షోలు, రేట్లకు అనుమతులు వచ్చేశాయి. కానీ తెలంగాణ సంగతే ఎటూ తేలడం లేదు.
గేమ్ చేంజర్ విడుదలకు ఇంకో మూడు రోజులు కూడా సమయం లేదు. కానీ ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అదనపు షోలు, రేట్ల కోసం దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్లే కనిపిస్తోంది. కానీ ఆయన ప్రయత్నం ఫలించేలా కనిపించడం లేదు. ‘డాకు మహారాజ్’ నిర్మాత నాగవంశీ అయితే.. తన సినిమాకు అదనపు రేట్ల కోసం ప్రయత్నమే చేయట్లేదని తేల్చేశారు. ఉన్న రేట్లు సరిపోతాయని అన్నారు. అదనపు రేట్లు వచ్చే అవకాశం ఉన్నట్లయితే రాజుతో పాటు నాగవంశీ కూడా ప్రయత్నం చేసి ఉండేవాడేమో. ఆశలు లేకనే ఆయన ఊరుకున్నట్లు కనిపిస్తోంది.
ఇకపై అదనపు రేట్లు ఉండవని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ప్రకటించాక.. మొదటగా ఆ అవసరం పడుతోంది సంక్రాంతి చిత్రాలకే. వీటికి రేట్లు ఇచ్చేస్తే తెలంగాణ సీఎం, మంత్రి చేసిన ప్రకటనకు విలువ లేకుండా పోతుంది. కనీసం నెల రోజులు కూడా తమ ప్రకటనకు కట్టుబడలేదని, ఇండస్ట్రీ వాళ్ల ఒత్తిడికి లొంగిపోయారనే పేరొస్తుంది. అందుకే సంక్రాంతి సినిమాలకు అదనపు రేట్లు మిడ్ నైట్ షోలు, ఉండకపోవచ్చనే అనిపిస్తోంది. కాబట్టి సంక్రాంతికి వచ్చే పెద్ద సినిమాలను తెలంగాణలోని సినీ ప్రియులంతా నార్మల్ రేట్లతోనే చూసి ఎంజాయ్ చేయబోతున్నట్లే అన్నమాట.