తండేల్ నిర్ణయం ముమ్మాటికీ రైటే…

గత ఏడాది పలుమార్లు వాయిదాపడి ఈ సంవత్సరం ఫిబ్రవరి 7 విడుదల తేదీ లాక్ చేసుకున్న తండేల్ ఒకవేళ సంక్రాంతికి వచ్చి ఉంటే ఎలా ఉండేదన్న చర్చ అక్కినేని అభిమానుల్లో జరుగుతోంది. గేమ్ ఛేంజర్ ఉంది కాబట్టే మేనల్లుడి మీద పోటీకి వెళ్లడం ఇష్టం లేక అల్లు అరవింద్ తప్పుకున్నారనేది ఓపెన్ సీక్రెట్.

అందులోనూ డాకు మహారాజ్, సంక్రాంతి వస్తున్నాం లాంటి క్రేజీ సినిమాలు బరిలో ఉన్నప్పుడు తండేల్ కు ఖచ్చితంగా థియేటర్ల సమస్య వస్తుంది. గీత ఆర్ట్స్ బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉన్న సంస్థే అయినప్పటికీ హీరో ఇమేజ్ కోణంలో చూసుకుంటే చైతు పై ముగ్గురి తర్వాతే నిలుస్తాడు.

సో తండేల్ కు సోలో రిలీజ్ అవసరం. వచ్చే నెల ఎంపిక చేసుకున్న డేట్ కి పోటీ లేదు. అప్పటికంతా పండగ మూవీస్ పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి. సో తగినన్ని స్క్రీన్లను సెట్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు ప్రెస్ మీట్ లో అరవింద్ చెప్పింది కూడా ఇదే.

ఒంటరిగా వస్తే కలిగే ప్రయోజనాన్ని వాడుకోవడానికి వాయిదా వేస్తున్నామని స్పష్టంగా వివరించారు. గతంలో నాని ఎంసిఏ, వైష్ణవ్ తేజ్ ఉప్పెన లాంటివి ఫిబ్రవరిలో వచ్చే బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. సో ఏదో డ్రై సీజనని అనుకోవడానికి లేదు. ఒకవేళ ఇప్పుడు వచ్చి ఉంటే మాత్రం ఓపెనింగ్స్ తో పాటు ఫైనల్ రన్ ఎఫెక్ట్ అయ్యేది.

ప్రస్తుతం తండేల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చేతిలో సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. దాంట్లోనే సెన్సార్, ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్, వివిధ నగరాల్లో ప్రెస్ మీట్లు, ప్యాన్ ఇండియా పబ్లిసిటీ ఇవన్నీ చూసుకోవాలి. నాగ చైతన్య, సాయిపల్లవి దానికి అనుగుణంగానే జనవరి ఇరవై తర్వాత తమ కాల్ షీట్స్ ని ఖాళీగా ఉంచుకునేలా ముందే ప్లాన్ చేశారట.

చందూ మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగా ప్లస్ అవుతోంది. బుజ్జి తల్లి, శివుడి జాతర సాంగ్ రెండూ ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇక ట్రైలర్ ఎప్పుడు వస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.