విజయ్ సేతుపతి తమిళ చిత్ర రంగంలో తనదైన ముద్ర వేసాడు. వైవిధ్యభరిత పాత్రలకు అతను పెట్టింది పేరు. హీరోగానే కాకుండా ఎలాంటి పాత్రనయినా చేయడానికి అతను సరేనంటాడు. విజయ్ సేతుపతి నటిస్తున్నాడంటే ఆ సినిమా ప్రత్యేకంగా వుంటుందనే నమ్మకాన్ని చూరగొన్నాడు. అయితే అతను అనౌన్స్ చేసిన కొత్త సినిమా తమిళ సినీ ప్రియులను, తమిళులను విపరీతమైన ఆగ్రహానికి గురి చేస్తోంది.
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథతో రూపొందుతోన్న ‘800’ చిత్రంలో విజయ్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. టెస్ట్ క్రికెట్లో ఎనిమిది వందల వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన మురళీధరన్ పట్ల వ్యక్తిగత ద్వేషం మనవాళ్లలో లేదు కానీ శ్రీలంకలో తమిళులను ఊచకోత కోసిన ఉదంతాలు, తమిళులపై అక్కడ జరిగే దురాగతాల నేపథ్యంలో ఒక శ్రీలంక దేశీయుడి కథతో తమిళుడు సినిమా చేయడమేంటనేది ఫాన్స్ కంప్లయింట్.
విజయ్ సేతుపతి శ్రీలంక జెర్సీ వేసుకుని, శ్రీలంక పతాకాలను మోయడాన్ని తమిళ జనం జీర్ణించుకోలేకపోతున్నారు. భారతీయుడివై వుండీ, అందులో తమిళుడవై వుండీ ఒక శ్రీలంక దేశీయుడి జీవిత కథలో నటించడానికి సిగ్గు లేదా అంటూ విజయ్‍పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఊహించని ఈ పరిణామంతో ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి విజయ్ సాహసిస్తాడా లేదా అనేది ఆసక్తికరం.