నిన్న చెన్నైలో జరిగిన మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ లుక్స్ చూసి అందరూ షాక్ తిన్నారు. బాగా సన్నబడిపోయి స్టేజి మీద మాట్లాడుతున్నప్పుడు మైకు పట్టుకున్న చెయ్యి వణుకుతూ ఉండటం చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మొన్నటికి మొన్న మార్క్ ఆంటోనీ, రత్నం సినిమాల్లో విశాల్ ఆరోగ్యంగా ఉన్నాడు.
తుప్పరివాలన్ 2 (డిటెక్టీవ్)ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నాడు. అలాంటిది హఠాత్తుగా ఇంత అనారోగ్యం ఎలా కలిగిందనే సందేహం రావడం సహజం. చెన్నై మీడియా ప్రకారం విశాల్ తీవ్రమైన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడని అయినా వచ్చాడని చెబుతున్నారు.
కేవలం జ్వరమే అయితే పర్వాలేదు కానీ ఏదైనా సమస్య ఉంటే మాత్రం మంచి చికిత్స తీసుకోవడం అవసరం. ఎందుకంటే గతంలో విశాల్ ఇలా కనిపించిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఎక్కడైనా సరే దూసుకెళ్ళిపోతూ స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా మాట్లాడే హీరో ఇలా కావడం ఎవరికైనా టెన్షన్ కలిగించే విషయమే.
12 సంవత్సరాల తర్వాత రిలీజవుతున్న మదగజరాజకు సోషల్ మీడియాలో అనూహ్యంగా మద్దతు దక్కుతోంది. సంతానం కామెడీ, అంజలి – వరలక్ష్మి శరత్ కుమార్ గ్లామర్, విజయ్ ఆంటోనీ సంగీతం తదితర అంశాలు క్రమంగా హై పెంచుతున్నాయి. సుందర్ సి దర్శకుడు కావడం మరో ప్లస్.
ప్రస్తుతం విశాల్ తుప్పరివాలన్ 2 మాత్రమే చేస్తున్నారు. మరో రెండు సినిమాలు ఫైనల్ చేయాల్సి ఉంది. మదగజరాజకు తొలుత హైప్ ఉండదేమో అనుకున్నారు కానీ అనూహ్యంగా బజ్ రావడం పట్ల సదరు టీమ్ సంతోషంగా ఉంది. పాత సినిమా అయినా ఎంటర్ టైన్మెంట్ ఫ్రెష్ గా ఉంటుందని సుందర్ హామీ ఇస్తున్నారు.
అజిత్ విడాముయార్చి తప్పుకోవడం వల్ల ఒక్కసారిగా ఏడెనిమిది తమిళ చిత్రాలు మూకుమ్మడిగా బాక్సాఫీస్ మీద దాడి చేస్తున్నాయి. బడ్జెట్ పరంగా గేమ్ ఛేంజర్ ఒకటే పెద్ద ప్యాన్ ఇండియా మూవీ. హీరో కోణంలో నెక్స్ట్ విశాల్ నిలుస్తాడు. చూడాలి మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో.