అన్నయ్య చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ కు ఎంత ప్రేమో ఇప్పటికే లెక్కలేనన్ని సందర్భాల్లో బయటపడినా ప్రతిసారి కొత్తగా అనిపించడం ఆ అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక. ఎన్నికల్లో విజయం సాధించాక స్వయంగా చిరు ఇంటికి పవన్ వెళ్లి కాలికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ప్రతి ఒక్కరిని తాకింది. ఇవాళ మరో అరుదైన జ్ఞాపకం భద్రపరుచుకునే అవకాశం మెగా ఫ్యాన్స్ కు దక్కింది. రాజమండ్రిలో లక్షకు పైగా హాజరైన జనసందోహం మధ్య జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా హాజరైన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తన అభిమానాన్ని మరోసారి చాటారు.
మీరు పవన్ కళ్యాణ్ అన్నా, రామ్ చరణ్ అన్నా, ఓజి అన్నా, గేమ్ ఛేంజర్ అన్నా అన్నింటికి ఆద్యులు చిరంజీవేనని, ఎక్కడో మొగల్తూరు నుంచి వచ్చి స్వయంకృషితో ఈ స్థాయికి వచ్చిన తీరే మమ్మల్ని ఇలా నిలిపిందని, మూలాలు మర్చిపోయే వ్యక్తిని కాదంటూ పవర్ స్టార్ అనడంతో ఒక్కసారిగా ప్రాంగణం చప్పట్లు, ఈలలతో మారుమ్రోగి పోయింది. దీనికన్నా ముందు టాలీవుడ్ ఉన్నత స్థాయికి దోహదం చేసిన మహానీయులను గుర్తు చేసుకున్న పవన్ కళ్యాణ్ స్వర్గీయులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ప్రస్తావన తీసుకువచ్చి గౌరవాన్ని చాటుకున్నారు. ఈ దిగ్గజాలు సినీ పరిశ్రమకు చేసిన సేవలను స్మరించుకున్నారు.
దర్శకుడు శంకర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు పవన్. జెంటిల్మెన్ సినిమాని చెన్నైలో బ్లాక్ టికెట్ కొనుక్కుని చూసిన సంఘటనని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ప్రసంగం మొదట్లో పవన్ కళ్యాణ్ అభిమానులకు అంటూ స్వంత ఫ్యాన్స్ ని సైతం సంబోధించడం ఆశ్చర్యం కలిగించింది. మొత్తానికి రాజకీయంగా చిరంజీవి ప్రజా వ్యవహారాలకు దూరంగా ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతిసారి తన కృతజ్ఞతను తెలియజేసుకుంటూనే ఉండటం గేమ్ ఛేంజర్ వేడుకలో మరోసారి బయట పడింది. జనవరి 10 విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం సాయంత్రమే టికెట్ రేట్ల వెసులుబాటు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates