ప్యాన్ ఇండియా సినిమాలకు టికెట్ రేట్ల పెంపు వ్యవహారం ప్రతిసారి విపరీతంగా ఆలస్యం కావడం గతంలో చూశాం. అయితే గత కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సానుకూల ధోరణి వల్ల నిర్మాతలకు పెద్ద టెన్షన్ తప్పుతోంది. తాజాగా గేమ్ ఛేంజర్ కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పర్మిషన్లు ఆరు రోజుల ముందుగా అది కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున ఇవ్వడం విశేషం.
పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఈ వేడుక ప్రారంభం కాక ముందే జిఓని విడుదల చేయడం మంచి పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు. సో ఫ్యాన్స్ కు సంబంధించి మొదటి టెన్షన్ అయితే పూర్తిగా తీరిపోయింది.
అర్ధరాత్రి ఒంటి గంటకు వేయబోయే బెనిఫిట్ షో టికెట్ ఒక్కటికి 600 రూపాయలు నిర్ణయించిన ప్రభుత్వం డిసెంబర్ 10 ఉదయం 4 గంటలకు అదనంగా ఒక షోతో పాటు మొత్తం ఆ రోజు ఆరు షోలకు అనుమతి మంజూరు చేసింది. ఆపై డిసెంబర్ 11 నుంచి 23 దాకా రోజుకు అయిదు షోల చొప్పున వేసుకోవచ్చు.
దీనికి గాను మల్టీప్లెక్సులు ప్రతి టికెట్ మీద 175 రూపాయలు, సింగల్ స్క్రీన్లు 135 రూపాయలు పెంచుకోవచ్చు. అంటే రెగ్యులర్ షోలకు మల్టీప్లెక్సుల్లో 352 రూపాయలు, సింగల్ స్క్రీన్లలో 282 రూపాయల దాకా ధర ఉంటుంది. డిసెంబర్ 24 నుంచి సాధారణ రేట్లు అమల్లోకి వస్తాయి.
ఇప్పుడు తెలంగాణ సర్కారు ఎలాంటి వెసులుబాటు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సంధ్య థియేటర్ ఉదంతం తర్వాత కాస్త కఠినంగానే ఉన్న సిఎం రేవంత్ రెడ్డిని దిల్ రాజు బృందం ఎలా ఒప్పించనుందనేది ఆసక్తికరంగా మారింది. పుష్ప 2 అంత కాకపోయినా కాస్త రీజనబుల్ గా పెంపు ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఏపీలో ఇచ్చేశారు కాబట్టి ఇక్కడా అలాంటి ఫలితాన్నీ ఇండస్ట్రీ ఆశిస్తోంది. మరి డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాంకు ఎంత పెంపుని నిర్మాతలు అడుగుతారో వేచి చూడాలి. మొత్తానికి రోజుల తరబడి వెయిట్ చేయించకుండా త్వరగా చర్యలు తీసుకోవడం శుభపరిణామం.