రాజమౌళి రాక మంచి హుషారు తెచ్చింది

ఇవాళ జరిగిన గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది రాజమౌళినే. ఉదయం మహేష్ బాబు 29 పూజా కార్యక్రమాలు జరుపుకుని సాయంత్రం ఇక్కడ వచ్చేయడంతో దాని గురించి ఏమైనా ఒకటి రెండు కబుర్లు చెబుతారేమోని యాంకర్ సుమతో పాటు విచ్చేసిన వారందరూ ఎదురు చూశారు. ఎప్పటిలాగే తెలివిగా స్కిప్ చేసిన జక్కన్న గేమ్ ఛేంజర్ టీమ్ తనను ఏ ఉద్దేశంతో పిలిచిందో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు. ఇప్పటి తరం దర్శకులకు శంకర్ గారు ఓజి లాంటి వాళ్ళని ఓ రేంజ్ లో పొగిడి ఆయన మీదున్న గౌరవాన్ని మరోసారి బహిరంగంగా చాటుకున్నారు.

రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ మగధీర నుంచి ఇప్పటిదాకా తను ఎదిగిన వైనం దగ్గరి నుంచి చూశానని హీరో అంటూ పిలుస్తూ మంచి అనుబంధం ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఇకపై గుర్రం స్వారీ సన్నివేశాలకు తన పర్మిషన్ తీసుకోవాలని సరదాగా చెప్పిన రాజమౌళి ఆ హక్కులను తనకే ఉన్నాయని చెప్పడంతో ఒక్కసారిగా స్టేజి ఘొల్లుమంది. వీరత్వంతో పాటు హృద్యంగా నటించడంలో చరణ్ ఎంతో పరిణితి చూపిస్తున్నాడని మెచ్చేసుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి ఆర్ఆర్ఆర్ వరకు ఎన్నోసార్లు చూసినా సరే ఇవాళ మాత్రం ఫ్యాన్స్ కి కొంచెం స్పెషల్ గా అనిపించిన మాట వాస్తవం.

లుంగి కట్టుకుని హెలీకాఫ్టర్ నుంచి దిగే షాక్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన రాజమౌళి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో బయట సినిమా వేడుకలకు రావడం తగ్గించిన జక్కన్న ఇవాళ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. జనవరి 10 తరుముకొస్తున్న తరుణంలో ప్రతి రోజు గేమ్ చేంజర్ ప్రమోషన్లకు కీలకం కానుంది. జనవరి 4 పవన్ కళ్యాణ్ ఛీఫ్ గెస్టుగా రాజమండ్రిలో చేయబోయే ఈవెంట్ కోసం కోట్లాది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ట్రైలర్ మాత్రం అంచనాలు అందుకునేలా ఉండి ఓపెనింగ్స్ కి సరిపడా హైప్ అయితే పెంచేసింది.