ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి. కానీ రాజమౌళి మాత్రం తన సినిమాల నుంచి ఏ చిన్న లీక్ లేకుండా జాగ్రత్త పడతారు. సినిమా మొదలైన దగ్గర్నుంచి ముగిసే వరకు ఆయన టీం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ సినిమా నుంచి ఏ విశేషం బయటికి పోకుండా చూసుకుంటుంది. ఐతే సినిమా చిత్రీకరణకు సంబంధించే కాదు.. ముహూర్త వేడుకకు సంబంధించిన విశేషాలు కూడా బయటికి రాకుండా చూసుకుంది చిత్ర బృందం.
గురువారమే ఈ సినిమా ముహూర్త వేడుకను హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్వహించారు. మహేష్-రాజమౌళి సినిమా రేంజ్ చాలా పెద్దదైనా.. ముహూర్త వేడుక విషయంలో మాత్రం పెద్దగా హడావుడి చేయట్లేదని తెలుస్తోంది. మామూలుగా ఇలాంటి వేడుకలు ప్రొడక్షన్ హౌస్‌లకు సంబంధించిన కార్యాయాల్లో లేదా గుడిలో కొంచెం ఘనంగా చేస్తుంటారు. కానీ మహేష్-రాజమౌళి సినిమా వేడుకను మాత్రం నగరం బయట సింపుల్‌గా చేశారు.
మీడియాకు కూడా అనుమతి లేదు. మామూలుగా తన సినిమాల ముహూర్త వేడుకలకు రాని మహేష్ కూడా ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించి టీం నుంచి ఎలాంటి ఫొటోలు, వీడియోలు బయటికి రాలేదు. లీక్స్ కూడా ఏమీ లేవు. సినిమాకు సంబంధించి ఎలాగూ ఏ సమాచారం బయటికి రాదు. కానీ ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి సంబంధించి ముహూర్త వేడుక ఫొటోలు, వీడియోలు అయినా రిలీజ్ చేయాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్ బయటికి రావడానికి కనీసం ఏడాది పట్టొచ్చు. ఈ కాలంలో మహేష్ కూడా బయట కనిపించే అవకాశాలు లేవు. సినిమా రిలీజ్ కోసం రెండేళ్లకు పైగా ఎదురు చూడాలి. ఈ నేపథ్యంలో ముహూర్త వేడుకను కూడా రహస్యంగా ఉంచడం కరెక్టా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఐతే ఈ వేడుకకు మీడియాను ఆహ్వానించకపోయినా.. వెంటనే ఏ ఫొటోలు, వీడియోలు రిలీజ్ చేయకపోయినా.. కొంచెం హడావుడి తగ్గాక అయినా ఆ విశేషాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారని భావిస్తున్నారు.