హింసను ఇష్టపడుతున్న 5జి ప్రేక్షకులు

ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి శూన్యంలో ఉన్నామనే స్థాయిలో జనాలు టెక్నాలజీకి అలవాటు పడ్డారు. చిప్స్ ప్యాకెట్ నుంచి బిర్యానీ దాకా, సినిమా టికెట్ నుంచి లగ్జరి వస్తువుల దాకా అన్ని అరచేతికి వచ్చేస్తున్నాయి. ఇంత సుఖం అలవాటు పడ్డాక కష్టమంటే ఏంటో తెలుసుకోవడం తగ్గిపోయింది. దాన్ని సినిమాల్లో చూసేందుకు ఇష్టపడటం మొదలయ్యింది. అందుకే వయొలెన్స్ డామినేషన్ గత కొన్నేళ్లుగా బాగా పెరిగింది. ఇటీవలే విడుదలైన మార్కోకు దక్కుతున్న ఆదరణ కన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదేమో.

తెలుగు వెర్షన్ ఆలస్యంగా రిలీజైనా మొదటి రోజే కోటి డెబ్భై అయిదు లక్షలకు పైగా గ్రాస్ సాధించడం చూస్తే సోషల్ మీడియా, రివ్యూల ప్రభావం మన జనాల మీద గట్టిగా ఉన్నట్టు కనిపిస్తోంది. మార్కోలో విపరీతమైన హింస ఉంది. కొన్ని జుగుప్సాకర సన్నివేశాలున్నాయి. కళ్ళు తిప్పుకోకుండా ప్రీ క్లైమాక్స్ చూడటం కష్టం. విలన్ చేసే మర్డర్లు అంత దారుణంగా ఉంటాయి. కానీ ఆడియన్స్ థియేటర్లలో చూస్తున్నారు. ఏ సర్టిఫికెట్ ఉన్నా సరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో యానిమల్ లాంటి వాటిలోనూ హింస ఉంది కానీ ఇంత తీవ్ర స్థాయిలో కాదు కదా కనీసం సగం కూడా లేదు. అయినా సరే మార్కో సూపర్ హిట్ దాటేసింది.

ఇలాంటి సినిమాల ప్రభావం సంఘం మీద ఉంటుందా లేదా అని డిబేట్ పెడితే రోజులు తరబడి జరుగుతుంది తప్ప దానికి కంక్లూజన్ దొరకదు. తెరమీద చూసే మంచిని నిజ జీవితంలో ఆచరించరేమో కానీ చెడుని మాత్రం వెంటనే ఫాలో అయ్యే యూత్ ఈ మధ్య పెరుగుతున్నారు. వెబ్ సిరీస్, ఓటిటిలు ఇప్పటికే విపరీత పోకడతో సెన్సార్ పెట్టాల్సిందే అని ప్రేక్షకులు డిమాండ్ చేసే దాకా వెళ్లిపోయాయి. ఇప్పుడు మార్కో ఆడింది కదాని అందరూ ఇదే ట్రెండ్ పాటిస్తే మాత్రం తెరమీద విపరీత రక్తపాతాన్ని చూడాల్సి వస్తుంది. ఇది అలవాటై రియల్ లైఫ్ లో హత్యలు జరిగినా స్పందించడం మానేస్తామేమో.