ఎస్ఎస్ఎంబి 29 – ముహర్తం వచ్చేసింది

అభిమానులే కాదు సగటు సినీ ప్రేమికులందరూ ఎదురు చూస్తున్న మహేష్ బాబు – రాజమౌళి కాంబో సినిమాకు శ్రీకారం చుట్టే రోజు వచ్చేసింది. రేపు ( జనవరి 2, 2025 ) అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. హైదరాబాద్ రాజమౌళి ఆఫీస్ వేదికగా ఈ కార్యక్రమం ఉంటుందని తెలిసింది. అయితే మీడియాని అనుమతించి ప్రెస్ మీట్ నిర్వహిస్తారా లేక కేవలం యూనిట్ సభ్యులతో కానిస్తారా అనేది ఇంకా ఖరారు కాలేదు. మాములుగా తన సినిమా ఓపెనింగ్ కి రాకపోవడాన్ని మహేష్ సెంటిమెంట్ గా భావిస్తారు. ఈసారి కూడా అదే ఫాలో అవుతారో లేక వస్తారో చూడాలి . విదేశాల నుంచి కొద్దిరోజుల క్రితం తిరిగి వచ్చారు.

టైటిల్ ఇంకా నిర్ధారణ కాని ఎస్ఎస్ఎంబి 29 మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఉంది. పలు అంతర్జాతీయ సంస్థలు కొలాబరేట్ అయ్యేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ కు వచ్చిన గ్లోబల్ రీచ్, జపాన్ లాంటి దేశాల్లో ఏడాదికి పైగా ఆడటం, ఆస్కార్ అవార్డు, నెట్ ఫ్లిక్స్ లో ప్రభంజనం, రాజమౌళి బాహుబలి మైలురాళ్ళు ఇవన్నీ ఎక్కడలేని హైప్ తీసుకొచ్చాయి. నిర్మాణానికి ఎంత టైం పడుతుందనేది తెలియదు కానీ కనీసం రెండు సంవత్సరాల కాల వ్యవధి అయితే తప్పదు. ఈ లెక్కన 2027లోనే మహేష్ బాబుని థియేటర్లలో చూడగలం. అప్పటిదాకా వెయిటింగ్ తప్పేలా లేదు.

క్యాస్టింగ్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ అంటూ ఏవేవో వినిపిస్తున్నా వాటిలో ఎంతవరకు నిజమనేది జక్కన్న చెబితే తప్ప కన్ఫర్మ్ కాదు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చే ఈ విజువల్ గ్రాండియర్ అడవుల నేపథ్యంలో సాగుతుంది. ఇండియానా జోన్స్ ని స్ఫూర్తిగా తీసుకున్న రాజమౌళి ఈసారి ఊహకందని ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారు. రేపటి వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు చాలానే హాజరు కాబోతున్నారట. ట్రిపులార్ తరహాలో సింపుల్ గా అనిపిస్తునే కనువిందు చేసే రేంజులో ఈవెంట్ ఉంటుందని టాక్. జనవరి చివరి వారంలో షూటింగ్ మొదలవుతుందని సమాచారం.