‘పుష్ప-2’ రిలీజ్ తర్వాత ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేని స్థితిలో ఉన్నాడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి బన్నీ అరెస్ట్, తదనంతర పరిణామాలు ఎంతగా చర్చనీయాంశం అయ్యాయో తెలిసిందే. ఇదొక పొలిటికల్ ఇష్యూ లాగా మారిపోవడంతో బన్నీ బాగా ఇబ్బంది పడ్డాడు. దీని వల్ల ‘పుష్ప-2’ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు, సక్సెస్ మీట్లు కూడా అనుకున్నట్లుగా చేయలేకపోయారు. ఇటీవలి పరిణామాలతో బన్నీ బయటికి రాకుండా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఐతే తాజా సమాచారం ఏంటంటే.. బన్నీ అన్నపూర్ణ స్టూడియోలో డబ్బింగ్ చెప్పడానికి వచ్చాడు. ప్రస్తుతం ఆ పనే నడుస్తోంది. పుష్ప-2 రిలీజై మూడు వారాలు దాటిపోయింది. కొత్తగా బన్నీ ఏ సినిమాను మొదలుపెట్టలేదు. అలాంటిది ఇప్పుడు డబ్బింగ్ చెప్పడం ఏంటి అని ఆశ్చర్యం కలగొచ్చు. అదే ఇక్కడ ట్విస్ట్. ‘పుష్ప-2’ సినిమా కోసమే బన్నీ ప్రస్తుతం డబ్బింగ్ చెబుతున్నాడు. ఈ సినిమా నిడివి పెరిగిపోవడం వల్ల ఎడిటింగ్‌లో కొన్ని సీన్లు లేపేశారు. వాటి వల్ల కథ కంటిన్యుటీ దెబ్బ తింది.
జపాన్‌లో బన్నీ ఇంట్రో ఫైట్ తర్వాతి సన్నివేశం అర్ధంతరంగా ముగిసిపోతుందన్న సంగతి తెలిసిందే. అసలీ సీన్ సినిమాలో ఎందుకు పెట్టారన్నది ప్రేక్షకులకు అంతుబట్టలేదు. అసలు హీరో జపాన్‌కు ఎందుకు వెళ్తాడు.. అక్కడ గన్ షాట్ తర్వాత ఏమైంది.. తిరిగి ఇండియాకు ఎలా వచ్చాడు.. ఈ ప్రశ్నలకు సమాధానం లేకపోయింది. ఈ లింక్ మిస్సయిన సీన్లే ఎడిటింగ్‌లో లేచిపోయాయి.
వాటిని ఇప్పుడు కలపడానికి చూస్తున్నారు. ఈపాటికే అవి థియేటర్లలో యాడ్ కావాల్సింది. కానీ వాటికి డబ్బింగ్ చెప్పడానికి బన్నీ అందుబాటులో లేకపోవడంతో లేట్ అయింది. జనవరి 1 నుంచి కొత్త సీన్లు కలపనున్నారట. ఇందుకోసం బన్నీ ప్రస్తుతం అన్నపూర్ణలో డబ్బింగ్ చెబుతున్నాడు. తెలుగు డబ్బింగ్ పూర్తయ్యాక మిగతా భాషల్లోనూ డబ్బింగ్ పూర్తి చేసి జనవరి 1 నుంచి థియేటర్లలో కొత్త సీన్లు కలపనున్నారు. ఓటీటీ వెర్షన్లో కూడా వీటిని చూడొచ్చు.