స్మార్ట్ ప్రమోషన్లతో వెంకటేష్ ముందంజ!!

బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది ఒప్పుకోవాల్సిన వాస్తవం. బిజినెస్ పరంగా కూడా అంతే. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి చేస్తున్న ప్రమోషన్లు, చేయించుకున్న పాటలు చాలా స్మార్ట్ గా ఉంటూ పెద్దగా ఖర్చు లేకుండా పని కానిస్తున్నాయి. తాజాగా వెంకటేష్ తో నేను పాడతా అంటూ స్వాతిముత్యంలో ఇళయరాజా బీజీఎమ్ వాడుకుంటూ చేసిన అనౌన్స్ మెంట్ టీజర్ మాములు కామెడీగా లేదు. కమల్ హాసన్ ని అనుకరిస్తూ వెంకీ ఇచ్చిన టైమింగ్ ఓ రేంజ్ లో పేలింది. మూడో సాంగ్ ఆయనే స్వయంగా పాడిటం విశేషం.

ఇంతకు ముందు ఒక గుంపు షూటింగ్ స్పాట్ కు వచ్చినట్టు చూపించి వాళ్ళు చరణ్ ఫ్యాన్సా లేక బాలయ్య అభిమానులా అని చెప్పించి కట్ చేసిన వీడియో బైట్ బాగా పేలింది. ఇలా పబ్లిసిటీ పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు క్రమంగా హైప్ పెంచుతున్నాయి. రెండు పాటలు అల్రెడీ ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. మూడోది వాటిని మించి ఉంటుందని ఊరిస్తున్నారు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ కాంపిటీషన్ తట్టుకుంటూ తన సినిమాకు ఎక్కువ బజ్ వచ్చేలా చేసుకోవడంలో రావిపూడి తన క్రియేటివిటీని బయటికి తీస్తున్నాడు. అందులో భాగంగా వదులుతున్న ప్రోమోలు బాగా వర్కౌట్ అవుతున్నాయి.

జనవరి 14 విడుదల కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ, యాక్షన్ రెండూ మిక్స్ చేసి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తీర్చిదిద్దారని టాక్. ఎఫ్2 తరహాలో లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా హిట్టు కొట్టడం ఖాయమని వెంకీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గత జనవరిలో రేగిన ఫ్లాప్ గాయం ఈసారి మాయమవుతుందని కోరుకుంటున్నారు. భీమ్స్ ఆశ్చర్యకరంగా సూపర్ హిట్ ఆల్బమ్ కంపోజ్ చేయడం హైప్ పరంగా ఉపయోగపడుతోంది. రెండు సినిమాలు నిర్మించడంతో పాటు మూడోది డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు మీద ఒత్తిడి తగ్గేలా అనిల్ రావిపూడి చేసుకుంటున్న సెల్ఫ్ ప్లానింగ్ మంచి ఫలితాలే ఇచ్చేలా ఉంది.