అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు వెంకట్ ప్రభు మూవీ కావడంతో రిలీజైన టైంలో ఫ్యాన్స్ పెద్ద అంచనాలు పెట్టుకున్నారు. కృతి శెట్టి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, యువన్ – ఇళయరాజా జంట సంగీతం ఇలా బోలెడు ఆకర్షణలు తోడయ్యాయి. తీరా చూస్తే ప్రేక్షకులను కనీస స్థాయిలో మెప్పించలేక తుస్సుమంది. కట్ చేస్తే తాజాగా ఓ తమిళ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు వెంకట్ ప్రభు చేసిన కామెంట్స్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఆయన ముందు అనుకున్న స్టోరీ ఇది కానే కాదట.
అసలు వెంకట్ ప్రభు రాసుకున్న పాయింట్ ఏంటంటే వెనుకబడిన కులానికి చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక పెద్ద క్రిమినల్ ని పట్టుకుంటాడు. తీరా చూస్తే అతనిది సేమ్ క్యాస్ట్. దీంతో వదిలేయాలనే ఒత్తిడి స్వంతం సంఘం నుంచే వస్తుంది. మరి అతను డ్యూటీకి కట్టుబడి నేరస్థుడిని కోర్టు ముందుకు ఎలా తీసుకొచ్చాడు, మధ్యలో ఎదురుకున్న అవమానాలు, అవరోధాలు ఏంటనే బ్యాక్ డ్రాప్ లో కస్టడీ సాగుతుంది. కానీ తెలుగు జనాలు ఈ కాన్సెప్ట్ ని అంగీకరించని భావించి దాన్ని మార్చేసి ముఖ్యమంత్రి, మాఫియా, హత్యలు, కిరాయి హంతకుడు అంటూ ఏవేవో కలిపేసి చివరికి ఖంగాళీ చేశారన్న మాట.
ఆయన ఏ ఉద్దేశంతో మార్చినా నష్టపోయింది మాత్రం నాగ చైతన్యనే. అయినా వెట్రిమారన్ విడుదల, పెరియరుమ్ పెరుమాళ్, వడ చెన్నై, కర్ణన్ లాంటి కోలీవుడ్ కల్ట్ క్లాసిక్స్ అన్నీ తమిళ జనాల అభిరుచులకు అనుగుణంగా కులం నేపథ్యంలో తీసినవి. ఇవేవి మన దగ్గర వర్కౌట్ కాలేదు. కాబట్టి కస్టడీకి పైన చెప్పినట్టు నిర్ణయం మార్చుకోవడం మంచిదే కానీ మరి ఈ కొత్తది ఏమైనా బ్రహ్మాండంగా వచ్చిందా అంటే అదీ లేదు. దీని తర్వాత వెంకట్ ప్రభుకి విజయ్ తో ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం ఆఫర్ వచ్చింది. కమర్షియల్ గా డబ్బులు వచ్చాయి కానీ మెప్పించడంలో మాత్రం ఈ విలక్షణ దర్శకుడు ఫెయిలయ్యారు.