అల్లరోడి కష్టానికి మళ్ళీ ఎదురుదెబ్బ తగలనుందా?

ఒకప్పుడు కామెడీ సినిమాలంటే కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన అల్లరి నరేష్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూశాడు. సుడిగాడు మొదటి వారం బ్లాక్ టికెట్లు అమ్మిన ట్రాక్ రికార్డు ఉంది. తర్వాత ఒకే మూసలో వెళ్లిపోవడంతో ఫ్లాపులు పలకరించి రూటు మార్చేశాడు. మహర్షి దానికి పునాది వేయగా నాంది విజయం ఊపిరి పోసింది. అయితే తనను ప్రేక్షకులు ఇలాగే చూడాలని కోరుకుంటున్నారనుకున్న అల్లరోడు తర్వాత చేసిన ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. సరే తిరిగి హాస్యం ట్రై చేద్దామని ఆ ఒకటీ అడక్కు చేస్తే అది కూడా తుస్సుమంది. తాజాగా బచ్చల మల్లితో పలకరించాడు.

పబ్లిక్ టాక్, రివ్యూలు, ఓపెనింగ్స్ చూస్తే బచ్చల మల్లి మరోసారి అల్లరి నరేష్ కి నిరాశ కలిగించేలా ఉంది. రామ్ చరణ్ కి రంగస్థలంలా తనకు ఇది ల్యాండ్ మార్క్ అవుతుందని దర్శకుడు సుబ్బుతో పాటు టీమ్ మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు. తీరా చూస్తే పెర్ఫార్మన్స్ పరంగా అల్లరి నరేష్ వైపు నుంచి బెస్ట్ వచ్చింది కానీ కథా కథనాలు, ట్రీట్ మెంట్ మెప్పించేలా లేకపోవడం మైనస్ గా మారింది. సీరియస్ టోన్ ఎక్కువైపోవడం, మల్లి క్యారెక్టరైజేషన్ లో జరిగిన ఓవర్ ఎక్స్ పోజర్ జనాలకు కనెక్ట్ కాలేదు. ఫాదర్ ఎమోషన్, ప్రేమకథ కూడా తేలిపోవడంతో బాగుందని అనిపించుకోవడంలో తడబడింది.

నిజానికి ఇలాంటి ఫలితాల్లో అల్లరి నరేష్ తప్పేమి లేదు. ఎందుకంటే తనవరకు ఎంత ఇవ్వాలో అంతా ఇస్తున్నాడు. వంక పెట్టేందుకు అవకాశం లేకుండా గమ్యం నుంచి బచ్చల మల్లి దాకా విమర్శలకు తావు లేకుండా చూసుకుంటున్నాడు. ఎటొచ్చి దర్శకులే తనని హ్యాండిల్ చేయడంలో చేస్తున్న పొరపాట్ల వల్ల ఫ్లాపులు పలకరిస్తున్నాయి. నిన్న విడుదలైన నాలుగు సినిమాల్లో వసూళ్ల పరంగా వెనుకబడింది బచ్చల మల్లే కావడం ట్రాజిడీ. టాక్ ఎలా ఉన్నా ముఫాసా, విడుదల పార్ట్ 2, యుఐలు మంచి ఆక్యుపెన్సీలు నమోదు చేశాయి. ఈ వీకెండ్ బచ్చల మల్లికి చాలా కీలకం. పికప్ కాకపోతే కష్టమే.