ముఫాసా ప్లాన్ బ్రహ్మాండంగా పేలింది!

హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ కి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాలని నిర్ణయించుకున్నప్పుడు ఎందుకు అవసరమా అని అనుకున్న వాళ్ళు చాలానే ఉన్నారు. సరే సూపర్ స్టార్ గొంతు ఇచ్చినంత మాత్రాన యానిమేషన్ మూవీకి ఒరిగేది ఏముందని కామెంట్ చేసిన బ్యాచ్ లేకపోలేదు. కట్ చేస్తే ఇది ఎంత పెద్ద ప్లస్సయ్యిందో థియేటర్ల దగ్గర సందడి సాక్షిగా నిరూపితమయ్యింది. ఒక ఉదాహరణ చూద్దాం. ప్రసాద్ మల్టీప్లెక్స్ పీసీఎక్స్ స్క్రీన్ కు రెండు తెలుగు షోలు ఇచ్చారు. అవి కనక ఫుల్ కాకపోతే ఇంగ్లీష్ కాదని ఇవి వేయడం వల్ల ఇలా జరిగిందని డిస్ట్రిబ్యూటర్ నిందిస్తాడు. ఇది యాజమన్యానికి కొంచెం ఇబ్బందే.

తీరా చూస్తే ఇంగ్లీష్ కన్నా వేగంగా తెలుగు వెర్షన్ టికెట్లే త్వరగా అమ్ముడుపోయాయి. ఇవాళ ఉదయం సుదర్శన్ 35 ఎంఎం దగ్గర పెద్ద కటవుట్, బ్యానర్లు, హోర్డింగులతో అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏదో మహేష్ బాబే ముఫాసాలో నటించిన రేంజ్ లో సింహం బొమ్మకు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ లో మాత్రమే కాదు ఏపీ తెలంగాణ మెయిన్ సెంటర్స్ లో చాలా చోట్ల టికెట్లు త్వరగా బుక్ కావడానికి కారణం మహేష్ బాబే అవుతున్నాడు. మాములుగా లయన్ కింగ్ బ్రాండ్ కు క్రేజ్ ఎక్కువ. దానికి ఈసారి గుంటూరు కారం రమణ గాడు తోడవ్వడంతో ఓపెనింగ్స్ అదిరిపోయేలా ఉన్నాయి.

విచిత్రం ఏంటంటే బచ్చల మల్లి, విడుదల పార్ట్ 2, యుఐ కంటే ఫాస్ట్ బుకింగ్స్ ముఫాసాకే ఉన్నాయి. చిన్నపిల్లల సినిమా అని పేరే కానీ పెద్దలు సైతం ఎగబడుతున్న వైనం కనిపిస్తోంది. రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 రావడానికి ఎంత లేదన్నా రెండేళ్లకు పైగా పడుతుంది కాబట్టి అప్పటిదాకా వచ్చే గ్యాప్ ని కొంతైనా పూడ్చుకునేందుకు ఫ్యాన్స్ ముఫాసాకు పోటెత్తుతున్నారు. ప్రీమియర్ టాక్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. మరీ ఎక్స్ ట్రాడినరి అనడం లేదు కానీ మంచి థియేటర్, సౌండ్ సిస్టమ్, త్రీడి ఉన్న చోట మాత్రం ఎంత మాత్రం నిరాశపరచదని అంటున్నారు. ఇండియా వైడ్ రెండు వందల కోట్ల గ్రాస్ ఆశిస్తున్నారు.