కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో అంతే మోతాదులో చేదు ఫలితాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ విషయంలో నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు. తాజాగా బచ్చల మల్లి ఈ లిస్టులో చేరిపోయింది. రేపు రిలీజ్ ఉన్నప్పటికీ ఇవాళ రాత్రి స్పెషల్ షోలు వేస్తున్నారు. హైదరాబాద్ ఏఏఏ, ఎఎంబిలో రెండు షోలు ప్రకటించగా క్రమంగా ఈ నెంబర్ పెరగబోతోంది. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో వేస్తామన్నారు కానీ ఇంకా నిర్ధారణగా తెలియాల్సి ఉంది.
ఒకరకంగా బచ్చల మల్లి ఈ రిస్క్ చేయడం మంచిదే. ఎందుకంటే రేపు మరో మూడు డబ్బింగ్ రిలీజున్నాయి. ముఫాసాకు మహేష్ బాబు ఫ్యాన్స్ మద్దతు ఉండగా, ఉపేంద్ర యుఐ మీద ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. విడుదల పార్ట్ 2 గురించి తెలిసిందే. విజయ్ సేతుపతి, వెట్రిమారన్ లు జనాలను థియేటర్లకు తీసుకొస్తారు. సో బచ్చల మల్లికి రాత్రి వచ్చే టాక్ కనక పాజిటివ్ ఉంటే అది సోషల్ మీడియా, ఇతరత్రా రివ్యూల ద్వారా రేపటికి ఉపయోగపడుతుంది. హిట్ అనిపించుకుంటే వచ్చే అడ్వాంటేజ్ పెద్దగా ఉంటుంది. కిరణ్ అబ్బవరంకు ఈ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయ్యి గొప్ప ఫలితం ఇచ్చింది.
సోలో బ్రతుకే సో బెటరూ ఫేమ్ సుబ్బు దర్శకత్వం వహించిన బచ్చల మల్లిలో హనుమాన్ భామ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఊర మాస్ కంటెంట్ కావడం వల్ల అన్ని వర్గాలకు నచ్చుతుందనే ధీమా మేకర్స్ లో ఉంది. అయితే పుష్ప 2 ది రూల్ హ్యాంగోవర్ ఇంకా కొనసాగుతున్న టైంలో ఇన్నేసి రిలీజులు రావడం మీద బయ్యర్లు కొంచెం టెన్షన్ గా ఉన్నా క్రిస్మస్ సెలవులు థియేటర్ ఫీడింగ్ కి దోహదం చేస్తాయని భావిస్తున్నారు. రామ్ చరణ్ కు రంగస్థలంలాగా అల్లరోడిగా బచ్చల మల్లి ఉంటుందనే రేంజ్ లో హైప్ ఇస్తున్నారంటే దీని సంగతేంటో ఈ అర్ధరాత్రికి తేలిపోనుందన్న మాట.