సుడిగాడు-2… పాన్ ఇండియా స్పూఫ్!

అల్లరి నరేష్ కెరీర్లో అతి పెద్ద హిట్.. సుడిగాడు. తమిళ బ్లాక్ బస్టర్ ‘తమిళ్ పడం’ ఆధారంగా తెరకెక్కినప్పటికీ.. తెలుగు సినిమాల మీద అదిరిపోయే స్పూఫ్‌లు, పేరడీలతో దీన్ని నాన్ స్టాప్ కామెడీ ఎంటర్టైనర్‌గా తీర్చిదిద్దారు భీమనేని శ్రీనివాసరావు. ఐతే ఈ సినిమా నరేష్‌కు ఎంత పెద్ద విజయాన్ని అందించిందో.. కెరీర్‌ను అంతగా డ్యామేజ్ చేసింది కూడా. అప్పటిదాకా తన చిత్రాల్లో అక్కడక్కడా ఒకట్రెండు స్పూఫులు ఉండేవి. కానీ ‘సుడిగాడు’ నిండా స్పూఫ్‌లు, పేరడీలతో నింపేయడంతో అది ఓవర్ డోస్ అయిపోయి.. తర్వాత ఈ టైపు కామెడీ చేస్తే జనాలకు మొహం మొత్తేసింది.

అందుకే అతను వరుసగా ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు. చివరికి కామెడీ వదిలేసి వేరే జానర్ల వైపు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఐతే ఇప్పుడు ఎక్కువగా సీరియస్ సినిమాలే చేస్తున్నప్పటికీ.. కామెడీని వదిలేయాలని అనుకోవట్లేదు నరేష్. సుడిగాడు-2 చేయడానికి అతను సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ ప్రాజెక్టు గురించి ‘బచ్చలమల్లి’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాల మీద స్ఫూఫ్‌ల ఆధారంగా తెరకెక్కించనున్నట్లు నరేష్ తెలిపాడు.

‘‘సుడిగాడు సినిమా రిలీజైనపుడు హిందీ ప్రేక్షకులకు అందులోని డైలాగులు అర్థం కాలేదు. స్పూఫులను కూడా అర్థం చేసుకోలేకపోయారు. తెలుగు సినిమాలంటే ఇంతేనేమో అనుకున్నారు. అందుకే ఈసారి.. వాళ్లు కూడా చూసిన పాన్ ఇండియా సినిమాల మీద స్పూఫులు చేయబోతున్నాం. సుడిగాడు సినిమా స్క్రిప్టు కోసం అప్పట్లో చాలా టైం పెట్టాం.

15 నెలల పట్టింది కథ తయారు చేయడానికి. ఈసారి ఇంకా ఎక్కువ టైం తీసుకుని కథ రెడీ చేస్తున్నాం’’ అని నరేష్ తెలిపాడు. ఐతే సుడిగాడు-2కు దర్శకుడు ఎవరు అన్నది నరేష్ వెల్లడించలేదు. భీమనేని శ్రీనివాసరావు చాలా ఏళ్లుగా సినిమాలు చేయని నేపథ్యంలో ఆయనే దీన్ని డైరెక్ట్ చేస్తారా అన్నది సందేహమే.