రామ్ చరణ్ 16లో నేను లేను : విజయ్ సేతుపతి

తమిళ హీరో విజయ్ సేతుపతి మనకు బాగా దగ్గరయ్యింది ఉప్పెన నుంచే. కృతి శెట్టి తండ్రి రాయణం పాత్రలో చూపించిన గాంభీర్యం, క్రూరత్వం టాలీవుడ్ జనాలకు బాగా దగ్గర చేసింది. అయితే కోలీవుడ్ లో విపరీతమైన బిజీలో ఉండటంతో తెలుగు ఆఫర్లను అట్టే ఒప్పుకోవడం లేదు. విడుదల పార్ట్ 1 హిట్టయ్యాక ఇప్పుడు విడుదల పార్ట్ 2 డిసెంబర్ 20 రిలీజ్ కు రెడీ అవుతోంది. దీని ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన విజయ్ సేతుపతి కొన్ని ఆసక్తికరమైన కబుర్లు పంచుకున్నాడు. అందులో రామ్ చరణ్ 16 ప్రస్తావన వచ్చింది. అందులో నటిస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాడు.

ఆర్సి 16లో తాను లేనని, అంత టైం దొరకడం లేదని, ప్రస్తుతం కథలు వింటున్నా ఏదీ సెట్ కావడం లేదని క్లారిటీ ఇచ్చాడు. నిజానికి అతనన్న మాటల్లో నిజముంది. ఎక్కువ ప్రాధాన్యం ఉంటే తప్ప చేయలేని ఇమేజ్ తనది. ఏదో ఆషామాషీగా క్యారెక్టర్లు చేసే పరిస్థితి లేదు. ఆ మాటకొస్తే పుష్పలోనూ ముందు ఆఫర్ ఇచ్చారనే టాక్ వచ్చింది. అది ఏ పాత్రనే లీక్ బయటికి రాలేదు కానీ ఫహద్ ఫాసిల్ దేననే ప్రచారం జోరుగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్సి 16లో లేనని స్పష్టంగా చెప్పడంతో డౌట్లన్నీ తీరిపోయాయి. ఉంటే బాగుండేదేమో కానీ బుచ్చిబాబు కథలో స్పేస్ లేకపోవడం వల్ల మిస్ అవుతున్నాం.

విడుదల పార్ట్ 2 మీద విజయ్ సేతుపతి చాలా నమ్మకంగా ఉన్నాడు. సీక్వెల్ మొత్తం ఈయన చుట్టే తిరుగుతుంది. ఫస్ట్ పార్ట్ లో కీలక పాత్ర పోషించిన సూరి ఈసారి తక్కువ కనిపిస్తాడు. ఇళయరాజా సంగీతం, మంజు వారియర్, డెప్త్ గా కనిపిస్తున్న యాక్షన్ విజువల్స్ అంచనాలు పెంచుతున్నాయి. పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ వెట్రిమారన్ డైరెక్షన్ కు మనదగ్గర కూడా బోలెడు ఫ్యాన్స్ ఉన్నారు. విడుదల పార్ట్ 1 కమర్షియల్ గా అద్భుతాలు చేయలేదు కానీ పార్ట్ 2 మాత్రం నిరాశ పరిచే ఛాన్స్ తక్కువగా ఉంది. కాకపోతే అల్లరి నరేష్, ఉపేంద్ర, లయన్ కింగ్, కిచ్చ సుదీప్, మోహన్ లాల్ కాంపిటీషన్ ని తట్టుకుని గెలవాలి.