వచ్చే వారం డిసెంబర్ 20 విడుదల కాబోతున్న హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ కు స్వాగతం చెప్పేందుకు మహేష్ బాబు అభిమానులు ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో టైటిల్ పాత్ర పోషించిన సింహానికి ఆయన డబ్బింగ్ మాత్రమే చెప్పారు. ఆ మాత్రం దానికే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంబరాలు చేస్తారట. బెంగళూరు వినాయక థియేటర్లో అతి పెద్ద కటవుట్ పెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఒక యానిమేషన్ మూవీకి ఇంత హంగామా చేయడం ఇదే మొదటిసారని నొక్కి చెబుతున్నారు. ఆ మధ్య మహేష్ తరఫున నమ్రతా శిరోద్కర్ ప్రమోషన్లలో పాల్గొనడం తెలిసిందే. ఇక్కడితో అయిపోలేదు.
ముఫాసా రిలీజవుతున్న మెయిన్ సెంటర్స్ అన్నింటిలోనూ ఇదే తరహా సందడి చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందట. లయన్ కింగ్ కు మన దేశంలో చాలా క్రేజ్ ఉంది. ఎంతగా అంటే షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హిందీ వెర్షన్ కి డబ్బింగ్ చెప్పేంత. ఇప్పుడు తెలుగులో మహేష్ బాబు తోడవ్వడంతో హైప్ ఇంకా పెరిగింది. మనిషి కనిపించకుండా కేవలం గొంతే వినిపిస్తుందని తెలిసినా కూడా ఫ్యాన్స్ ఇంతగా ఎగ్జైట్ మెంట్ చూపించడం అంటే మాములు విషయం కాదు. గుంటూరు కారం తర్వాత మహేష్ దర్శనం లేదు. రాజమౌళి ఇంకా షూటింగ్ మొదలుపెట్టనేలేదు. అందుకే ముఫాసానే ఎడారిలో నీటిజల్లుగా కనిపిస్తోంది.
పైకి చిన్న పిల్లల సినిమాగా కనిపించినా గ్రౌండ్ లెవెల్ లో ముఫాసాకు పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఇండియాలో కనీసం రెండు వందల కోట్లు వసూలు చేస్తుందని ఒక అంచనా. పుష్ప 2 ది రూల్ హడావిడి తర్వాత బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సినిమా ఏదీ రాలేదు. అన్నీ క్రిస్మస్ ని లక్ష్యంగా పెట్టుకోవడంతో సిద్దార్థ్ మిస్ యు తప్ప చెప్పుకోదగ్గవి ఏమి లేవు. ముఫాసాకు అల్లరి నరేష్ బచ్చల మల్లి, విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2, ఉపేంద్ర యుఐ, సుదీప్ మ్యాక్స్ లతో పోటీ ఉంది. నితిన్ రాబిన్ హుడ్. ప్రియదర్శి సారంగపాణి జాతకం వాయిదా పడ్డాయనే టాక్ ఉంది కానీ నిర్మాణ సంస్థల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.