బ్రేకింగ్: అల్లు అర్జున్ కు బెయిల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై వాడీ వేడీ వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి కీలక తీర్పునిచ్చారు. పరిమిత కాలానికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నామని జడ్జి తెలిపారు. దీంతో, అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించినట్లయింది.

వాస్తవానికి నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు, అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆ వాదనలు మరింత సమయం పట్టేలా ఉండడంతో అల్లు అర్జున్ ను జైలుకు తరలిస్తారని అంతా అనుకున్నారు.

దీంతో, చంచల్ గూడ జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడకు భారీగా అల్లు అర్జున్ అభిమానులు చేరుకున్నారు. అయితే, ఈ లోపు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ లభించడంతో అభిమానులు శాంతించారు. మరి కాసేపట్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.