నితిన్ తప్పుకోవడం వెనుక అసలు ప్లానింగ్ ఇదా…

డిసెంబర్ 25 విడుదల కావాల్సిన రాబిన్ హుడ్ క్రిస్మస్ రేసు నుంచి తప్పుకోవడం దాదాపు ఖరారే. అధికారికంగా ప్రకటించలేదు కానీ నిర్ణయం జరిగిపోయిందని సమాచారం. పుష్ప 2 వేడితో పాటు విపరీతమైన పోటీ ఉండటం వల్ల వసూళ్లు ప్రభావితం చెందుతాయని భావించి ఆ మేరకు జనవరికి వాయిదా వేశారని తెలిసింది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13 రిలీజ్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారట. పొయ్యి నుంచి పెనంలో పడ్డట్టు నితిన్ అక్కడ రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి పెద్ద కాంపిటీషన్ ని తట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇలా ఎందుకు చేశారనే దానికి కారణాలు లేకపోలేదు.

అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీ కోసం మైత్రి సంస్థ తమ థియేటర్లు, స్క్రీన్లు అవసరమైన మేరకు ముందస్తుగానే లాక్ చేసి ఉంచింది. ఇప్పుడది రావడం లేదు కాబట్టి అవన్నీ రాబిన్ హుడ్ కి ఇచ్చేయొచ్చు. పైగా పుష్ప 2 ది రూల్ నడిపిస్తున్న ఎగ్జిబిటర్ల నుంచి ఎలాగూ సహకారం ఉంటుంది. సో పోటీ గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట. పైగా గతంలో ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణిలతో తలపడి శతమానంభవతి లాంటి ఫ్యామిలీ మూవీ విజయం సాధించడాన్ని గుర్తు చేసుకుంటూ రాబిన్ హుడ్ తో రిస్క్ చేయాలని నిర్ణయించుకున్నట్టు వినిపిస్తోంది. అఫీషియల్ కావాల్సి ఉంది.

ఒకరకంగా నితిన్ తప్పుకోవడం మంచిదే అనిపిస్తున్నప్పటికీ కంటెంట్ ఎక్స్ ట్రాడినరిగా ఉంటేనే రాబిన్ హుడ్ సంక్రాంతికి వసూళ్లు రాబట్టగలడు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాంకు వచ్చే టాక్స్ కీలకం కాబోతున్నాయి. చలో, భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన రాబిన్ హుడ్ లో శ్రీలీల హీరోయిన్ గా చేయడం, జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చడం లాంటి ఆకర్షణలు చాలానే ఉన్నాయి. పైన చెప్పిందే నిజమైన పక్షంలో సంక్రాంతికి రోజుకొక సినిమా చొప్పున మూవీ లవర్స్ కి కన్నులపండగే. వరస ఫ్లాపుల నుంచి ఇది గట్టెక్కించి బ్లాక్ బస్టర్ ఇస్తుందనే నమ్మకంతో నితిన్ ఉన్నాడు.