హిట్టు కొట్టి కూడా బాధ పడుతున్న హీరో

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన కుర్రాడు కార్తీక్ ఆర్యన్. ‘ప్యార్ కా పంచ్‌నామా’ అనే హిట్ మూవీతో అరంగేట్రం చేసిన అతను.. తర్వాత ‘సోనూ కి టిటు కి స్వీటీ’, ‘భూల్ భులయియా-2’, ‘భూల్ భూలయియా-3’ లాంటి బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ముఖ్యంగా భూల్ భులయియా ఫ్రాంఛైజీతో తన రేంజే మారిపోయింది. కార్తీక్ సక్సెస్ స్ట్రీక్ చూసి పెద్ద స్టార్లు కూడా కుళ్లుకునే పరిస్థితి ఉంది.

ఐతే తాను ఇలా పెద్ద హిట్లు కొడుతున్నప్పటికీ ఇండస్ట్రీలో ఇప్పటి ఒంటరివాడినే అంటూ కార్తీక్ తాజాగా ఒక రకమైన నిర్వేదాన్ని వ్యక్తం చేశాడు. ఇండస్ట్రీలో తనకు ఎవ్వరూ మద్దతివ్వడం లేదని అతను వ్యాఖ్యానించాడు. గతంలో కార్తీక్‌తో ఓ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి రంగం సిద్ధం చేసిన అగ్ర నిర్మాత కరణ్ జోహార్.. ఏవో కారణాలతో అతణ్ని తప్పించాడు. అప్పట్నుంచి కార్తీక్‌ బాలీవుడ్లో ఒంటరివాడైపోయాడనే అనుమానాలున్నాయి.

కాకపోతే వరుస హిట్లతో కార్తీక్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో కార్తీక్ మాట్లాడుతూ.. ‘‘నేను ఒంటరి యోధుడిని. ఈ రోజు మీరు చూస్తున్న ఈ ఇల్లు సొంతంగా సంపాదించిన డబ్బులతో కొన్నాను. ఇక్కడిదాకా చేరుకోవడానికి పిచ్చివాడిలా పోరాడాను. ఇంకా పోరాడుతూనే ఉన్నా. నాకు భవిష్యత్తులోనూ ఇండస్ట్రీ మద్దతు లభించదని తెలుసు. భూల్ భులయియా-3 ఈ ఏడాది అతి పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది. అయినప్పటికీ నా వెనుక ఎవరూ రారనే వాస్తవాన్ని నేను అర్థం చేసుకున్నాను.

అందుకే మంచి సినిమాలు ఎంచుకుని నాకు నేనుగా ఎదగాలని నిర్ణయించుకున్నా. నా కెరీర్లో ఎంతోమందిని కలిశాను. కానీ ఇండస్ట్రీలోని పెద్దలను మాత్రం కలిసే అవకాశం రాలేదు. వారి మనసులు గెలవాలనే కోరికేమీ నాకు లేదు. ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటే చాలు. వారి మద్దతు ఉంటే ఏదైనా సాధించగలను’’ అని చెప్పాడు. కార్తీక్ మాటల్ని బట్టి చూస్తుంటే.. బాలీవుడ్లో పెద్దలుగా గుర్తింపు పొందిన వాళ్లకు తన సక్సెస్‌ మింగుడుపడడం లేదనే అనిపిస్తోంది.