శ్రీలీల సుడి బాగుంది… చెంతకొస్తున్న మిస్సింగ్ ఛాన్సులు!

ఇటీవలే పుష్ప 2 ది రూల్ లో కిస్ కిస్ కిస్సిక్కు అంటూ స్పెషల్ సాంగ్ తో ఊపేసిన శ్రీలీలకు అటు ఉత్తరాదిలోనూ గుర్తింపు వచ్చేసింది. కాకపోతే మరొకరికి మిస్సవుతున్న ఛాన్సులు శ్రీలీలను వెతుక్కుంటూ రావడం కాకతాళీయం. ముందు ఈ పాట కోసం చాలా మందిని అనుకున్నారు. జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, దిశా పటాని ఇలా ఎన్నో ఆప్షన్లు పరిశీలించాక, కలుసుకున్నాక ఏవేవో కారణాల వల్ల డ్రాప్ అయ్యారు. చివరికి మైత్రిలోనే రాబిన్ హుడ్, ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్న శ్రీలీలని ఒప్పించారు. కట్ చేస్తే ఇదేమో వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఇంత పెద్ద సక్సెస్ లో గుంటూరు కారం భామ భాగమయ్యింది.

నితిన్ చేస్తున్న రాబిన్ హుడ్ కి ముందు అనౌన్స్ చేసింది రష్మిక మందన్నని. కానీ డేట్స్ కుదరలేదు. పుష్ప 2 షెడ్యూల్స్ వల్ల దీంట్లో నటించడం సాధ్యం కాకపోవడంతో అది కాస్తా శ్రీలీలను చేరింది. తాజాగా నాగచైతన్య సినిమాలోనూ ఒక ఆఫర్ దక్కించుకుందని ఇన్ సైడ్ టాక్. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందబోయే ఫాంటసీ థ్రిలర్ లో తొలుత మీనాక్షి చౌదరిని అనుకున్నారట. కానీ ఇప్పుడా ఆ స్థానంలో శ్రీలీల దాదాపు లాకైనట్టేనని వినికిడి. ఇంతకు ముందు గుంటూరు కారంలో పూజా హెగ్డేతో కొంత షూటింగ్ చేశాక ఆమె ప్లేసులో శ్రీలీల వచ్చిన సంగతి మర్చిపోకూడదు.

ఈ లెక్కన శ్రీలీల దర్శక నిర్మాతలకు మంచి ఆల్టర్నేటివ్ గా మారుతోంది. డిమాండ్ ఎంత ఉన్నప్పటికీ ఎంబిబిఎస్ పరీక్షల కోసం గుంటూరు కారం తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న శ్రీలీల ఇకపై స్పీడ్ పెంచే ఆలోచనలో ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ ప్రకటిస్తే దానికి డేట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈలోగా ధమాకా కాంబో రిపీట్ చేస్తూ రవితేజతో నటిస్తున్న మాస్ జాతర మే 9 రిలీజైపోతుంది. ఇకపై బ్రేక్ లేకుండా చూసుకుంటానని చెబుతున్న శ్రీలీల ఈ డిసెంబర్ లోనే రెండుసార్లు దర్శనమివ్వనుంది. పుష్ప 2లో డాన్స్ చూశాం. రాబిన్ హుడ్ లో పెర్ఫార్మన్స్ కి స్కోప్ చాలా ఉందని టీమ్ పదే పదే చెబుతోంది.