అందంగా లేనని మొహం మీదే చెప్పారు : శోభిత!

ఈ నెల 4న అక్కినేని నాగచైతన్యతో వివాహం చేసుకున్న శోభిత ధూళిపాళ తన కొత్త జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. చైతన్య తన జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన సింప్లిసిటీ, మంచి గుణాలు, మర్యాదలతో తనను ఎంతో ఆకట్టుకున్నారని పేర్కొంది. ప్రేమలో ఆత్మీయత ఎక్కువగా ఉండాలనేది చైతూ నుంచి నేర్చుకున్నానని చెప్పింది.

ఆలయ సందర్శన తనకు ఎంతో ప్రశాంతతనిస్తుందని, చిన్ననాటి నుంచే భక్తి తన జీవితంలో భాగమైందని తెలిపింది. సమయం దొరికినప్పుడల్లా కూచిపూడి, భరతనాట్యం ప్రాక్టీస్ చేయడం ఇష్టమని, పుస్తకాలు చదవడం, కవిత్వం రాయడం తనకు ప్రత్యేకమైన సంతోషాన్ని ఇస్తాయని తెలిపింది. వంట విషయంలోనూ తనకు ప్రావీణ్యం ఉందని, ఆవకాయ, ముద్దపప్పు వంటి డిష్‌లు చేసేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటానని పేర్కొంది.

తొలి రోజుల్లో ఎదురైన తిరస్కరణల గురించి మాట్లాడుతూ, అందంగా లేనని, ఆకట్టుకునేలా లేనని మొహం మీదే చెప్పి రిజెక్ట్ చేశారని శోభిత వివరణ ఇచ్చింది. ఇక బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా సరిపోనని ఒక ఆడిషన్స్ లో ఎదురైన చేదు అనుభవాలను కూడా ఆమె గుర్తుచేసుకుంది. కానీ పట్టుదలతో అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారడంలో సంతోషం వ్యక్తం చేసింది. ఈ మార్గంలో ఆత్మవిశ్వాసమే తన విజయానికి దోహదమైందని శోభిత పేర్కొంది.

తన కెరీర్ గురించి మాట్లాడుతూ, ఏదైనా పాత్ర తన మనసుకు నచ్చితేనే ఒప్పుకుంటానని, ప్రతీ ప్రాజెక్టును ఎంచుకునే ముందు తగిన ఆలోచన చేస్తానని చెప్పింది. విభిన్న పాత్రలలో నటించడం ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవాలనేది తన లక్ష్యమని, సినిమాల్లో స్థానం అనేది కేవలం కెరీర్‌కే పరిమితం కాకుండా తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచే దిశగా ఉపయోగపడుతుందని వివరించింది.