ఈ గురువారం భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప-2.. ఆ అంచనాలను అందుకుంది. ఈ సినిమా చూసి మామూలు మాస్ కాదు అంటూ ఊగిపోతున్న వాళ్లున్నారు. పక్కా పైసా వసూల్ మూవీ అని కితాబిస్తున్నారు. అదే సమయంలో సుకుమార్ నుంచి ఇంకా ఎక్కువ ఆశించి కొంచం నిరాశపడ్డవాళ్లూ ఉన్నారు. ఎప్పుడూ సుకుమార్ సినిమాల్లో ఉండే బ్రిలియన్స్ ఈ సినిమాలో లేదని.. ఆయన బోయపాటి మోడ్‌లోకి వచ్చేశారని అంటున్నారు.
ఐతే టాక్ ఎలా ఉన్నప్పటికీ వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. రెండో రోజు కొద్దిపాటి డ్రాప్ చూసిన పుష్ప-2.. వీకెండ్ అయిన మూడో రోజు పుంజుకుంది. దేశవ్యాప్తంగా వసూళ్లు బాగున్నాయి. హిందీలో అయితే సినిమా కుమ్మేస్తోంది. ఐతే అడ్వాన్స్ బుకింగ్స్ చూసినా.. ఆఫ్ లైన్ బుకింగ్స్‌ను గమనించినా.. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
సింగిల్ స్క్రీన్లలో ఉన్నంత సందడి.. మల్టీప్లెక్సుల్లో కనిపించడం లేదు. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. పుష్ప-2 ఊర మాస్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఇలాంటి సినిమాను సింగిల్ స్క్రీన్లలోనే బాగా ఎంజాయ్ చేయగలమని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఇప్పటికీ సింగిల్ స్క్రీన్లలో సినిమా చూడ్డానికి ఇష్టపడే మాస్ ప్రేక్షకులు అటే వెళ్తున్నారు. మల్టీప్లెక్సుల్లో స్పందన కొంచెం తగ్గడానికి ఇంకో ముఖ్య కారణం.. టికెట్ల ధరలు. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ రేట్ల మీద దాదాపు రెట్టింపు పెంచేశారు పుష్ప-2కు.
తొలి వీకెండ్ ఈ సినిమా చూడాలంటే మల్టీప్లెక్సుల్లో 600 దాకా పెట్టాల్సి వస్తోంది. సింగిల్ స్క్రీన్లలో రేటు దాని మీద 200 దాకా తక్కువ ఉంటోంది. అసలే రేటు ఎక్కువ. మల్టీప్లెక్స్ అంటే మరీ మోత మోగిపోతుందనే ఉద్దేశంతో సింగిల్ స్క్రీన్లను ప్రిఫర్ చేస్తున్నారు ఆడియన్స్. పుష్ప-2 మీద ఓవరాల్‌గా టికెట్ల ధరలపెంపు ప్రతికూల ప్రభావం చూపిస్తున్న మాట వాస్తవం. కాబట్టి క్రేజ్ ఉంది కదా అని మరీ అతిగా రేట్లు పెంచితే చేటు అనే విషయం గుర్తిస్తే మంచిది. తర్వాత రాబోయే పెద్ద సినిమాలకు రీజనబుల్‌గా రేట్లు ఉండేలా చూసుకుంటే మేలు.