ఆ ఛానెల్ పని పట్టబోతున్న రియా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతికి రియా చక్రవర్తి ఎంత వరకు బాధ్యురాలో ఏమో కానీ.. ఓ వర్గం మీడియా మాత్రం ఆమెపై నీలాప నిందలు వేసింది. సుశాంత్ జీవితాన్ని ఆమె సర్వనాశనం చేసిందంటూ కథనాలు ప్రసారం చేసింది. పోలీసుల విచారణ మొదలు కాకముందే ఆమెను దోషిగా తేల్చేసింది. ముఖ్యంగా అర్నాబ్ గోస్వామి ఆధ్వర్యంలో నడిచే రిపబ్లిక్ టీవీ.. రియాను ఎలా టార్గెట్ చేసిందో అందరూ చూశారు.

మిగతా అన్ని వార్తలూ పక్కన పెట్టేసి రెండు మూడు నెలల పాటు సుశాంత్ ఇష్యూనే నెత్తికెత్తుకున్న ఆ ఛానెల్ రియాను మరీ దారుణంగా టార్గెట్ చేసిందనే అభిప్రాయం అందరిలో కలిగింది. ముందు సుశాంత్ మృతి విషయంలో ఆమెపై నిందలేసిన ఆ ఛానెల్.. ఆ తర్వాత డ్రగ్స్ విషయంలోనూ ఆమెను టార్గెట్ చేసింది. ముందు రియా మీద వ్యతిరేకతతో ఉన్న వాళ్లు సైతం ఆమె మీద జాలిపడే స్థాయిలో ఆమెపై నెగెటివ్ క్యాంపైనింగ్ నడిచింది.

ఐతే డ్రగ్స్ కేసులో బెయిల్ రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కస్టడీ నుంచి ఎట్టకేలకు బయటికి వచ్చిన రియా.. నేరుగా రిపబ్లిక్ టీవీని ఢీకొట్టేందుకు రెడీ అయింది. ఆ ఛానెల్ మీద పరువు నష్టం దావా వేసి న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. సుశాంత్ మృతికి రియానే కారణమని అదే పనిగా రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన కథనాల తాలూకు రియా టీం సేకరించిందట.
సుశాంత్‌ది ఆత్మహత్యే అని ఎయిమ్స్ వైద్యులు నిర్ధరించడం.. అతడి మృతికి సంబంధించి ఎవరి మీదా సందేహాలు లేవని, అతడిది ఆత్మహత్యే అని సీబీఐ సైతం తుది నివేదిక సిద్ధం చేస్తున్నట్లు వార్తలు రావడం తెలిసిందే. అదే నిజమైతే తన మీద చేసిన ఆరోపణలు, ప్రసారం చేసిన నెగెటివ్ వార్తలపై ప్రశ్నలు సంధిస్తూ అర్నాబ్ అండ్ టీంకు నోటీసులు ఇవ్వబోతోందట రియా. తనపై డ్రగ్స్ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని ఇంత తేలిగ్గా వదలకూడదని.. రిపబ్లిక్ టీవీ నోరు మూయించాలని ఆమె పట్టుదలతో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.