మరికొద్ది గంటల్లో ‘పుష్ప 2: ది రూల్’ ప్రీమియర్లు మొదలుకాబోతున్న తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు ఒక ట్వీట్ చేయడం ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీస్తోంది. వందలాది టెక్నీషియన్లు, 24 క్రాఫ్ట్స్ కలిసి పని చేసి వేలాది మందికి ఉపాధి కలిగిచే సినిమాను విజయవంతం చేయాల్సిన బాధ్యత సినీ ప్రియులు, అభిమానుల మీద ఉందని ఎక్స్ వేదికగా ట్వీట్ వేయడం ఈ డిస్కషన్ కు కారణం. అందులో ఆయన ఎక్కడా అల్లు అర్జున్ ని ట్యాగ్ చేయడం, పుష్ప 2 పేరు ప్రస్తావించడం కానీ చేయలేదు. నిర్మాణ సంస్థ, దర్శకుడు, సాంకేతిక నిపుణులు ఎవరిని మెన్షన్ చేయకుండా కేవలం ఆదరించమని కోరారు.
ఇలా చేయడం వెనుక కారణం లేకపోలేదు. ఎన్నికల ప్రచారంలో వైసిపి స్నేహితుడి కోసం బన్నీ నంద్యాల వెళ్లినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ తన మీద గుర్రుగా ఉన్నారు. ఈ విభేదాలు ఆన్ లైన్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. రిలీజ్ దగ్గరలో కలెక్షన్లు, టికెట్ రేట్ల గురించి డిబేట్లు హాట్ గా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2ని చూడకూడదని, బెనిఫిట్ షోలు కొనకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇదంతా నాగబాబుకి చేరడం వల్లే పుష్ప 2 కోసం సందేశమిచ్చారా లేక యధాలాపంగా అన్నది బహిరంగ రహస్యమే. ఎందుకంటే ఈ వారంలో పుష్ప 2 తప్ప ఇంకే తెలుగు రిలీజ్ లేదు కాబట్టి.
ఉదయం సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ అందరికి శుభాకాంక్షలు చెబుతూ పుష్ప 2 పోస్టర్ పెట్టాడు. మెగా, అల్లు మధ్య ఏవో విభేదాలున్నాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో అధిక శాతం ఆ ఫ్యామిలీ వాళ్ళు మౌనంగా ఉండటం సందేహాలను పెంచుతోంది కానీ అబ్బే అదేమీ లేదని ఆయా వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. సరే ఏదో ఒక రకంగా నాగబాబు అయితే సినిమాని సినిమాగా చూడమనే మెసేజ్ ఇచ్చారు కాబట్టి దీని ప్రభావం ఎంత మొత్తంలో ఉంటుందనేది చెప్పలేం కానీ కొంత వేడిని చల్లార్చడానికి ఉపయోగపడొచ్చు. కాకపోతే పుష్ప 2 పేరు ట్వీట్లో ఉంటే ప్రభావం ఎక్కువగా ఉండేది.