ఏమబ్బా పుష్ప… 3D ఏమైనట్టు!

‘పుష్ప: ది రూల్’ మేకింగ్ దశలో ఉండగా ఎప్పుడూ దీన్ని త్రీడీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించలేదు మేకర్స్. త్రీడీలో ఏదైనా సినిమా తీస్తే ముందే ఆ విషయాన్ని అనౌన్స్ చేసి.. ప్రమోట్ చేస్తారు. ప్రేక్షకులను ఆ దిశగా ప్రిపేర్ చేస్తారు. కానీ ‘పుష్ప-2’ టీం మాత్రం ఆ పని చేయకుండా.. ట్రైలర్ రిలీజపుడు పెద్ద షాకిచ్చింది. ఈ సినిమాను త్రీడీలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇంకా ఐమాక్స్, 4డీఎక్స్ వెర్షన్లు కూడా ఉన్నాయని కూడా ప్రకటించింది. ఇలాంటి మాస్ మూవీకి త్రీడీ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు. ఐతే రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి త్రీడీ వెర్షన్ ఏమైందో తెలియట్లేదు. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఎక్కడా త్రీడీ వెర్షన్ కనిపించడం లేదు. అంతటా 2డీలోనే రిలీజ్ అవుతోంది. హైదరాబాద్‌లో ఒక్క థియేటర్లో మాత్రమే 4డీ వెర్షన్ అందుబాటులో ఉంది.

త్రీడీ గురించి అంత ఘనంగా ప్రకటించి ఇప్పుడు షోలు లేకపోవడం ఏంటో అర్థం కావడం లేదు.టీం నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే.. త్రీడీ వెర్షన్‌కు అనుగుణంగా చిత్రీకరణ జరిగింది కానీ.. చివర్లో పూర్తి స్థాయిలో సినిమాను త్రీడీలోకి కన్వర్ట్ చేయడానికి టైం సరిపోలేదు. 2డీలో సినిమాను రెడీ చేయడానికే చాలా కష్టమైంది. చివరి నిమిషంలో షూట్లు, కరెక్షన్లతోనే సుకుమార్ అండ్ టీంకు సరిపోయింది. త్రీడీ వెర్షన్ కోసం టైం కేటాయించే పరిస్థితి లేకపోయింది. టీం ఇంకెవ్వరూ కూడా దీని మీద దృష్టిపెట్టలేని స్థితిలో ఆ వెర్షన్‌ను పక్కన పెట్టేసినట్లు సమాచారం. ఐతే ‘పుష్ప-2’ లాంటి సినిమాను త్రీడీలో చూడడానికి ఎవరికీ అంత ఆసక్తి ఏమీ లేదు.

ఇటీవలే సూర్య సినిమా ‘కంగువ’ను త్రీడీలో చూసి ప్రేక్షకులు పెదవి విరిచారు. త్రీడీలో కంటే 2డీలోనే సినిమా బెటర్ అనే అభిప్రాయాలు కలిగాయి. ‘కల్కి’ లాంటి విజువల్ వండర్స్‌కు మాత్రమే త్రీడీ వెర్షన్ బాగుంటుంది కానీ.. సగటు మాస్ సినిమాలను 2డీలో చూస్తేనే కిక్కు అన్నది మెజారిటీ అభిప్రాయం.